విశాల్‌కు కోర్టు అక్షింతలు

23 Sep, 2023 10:44 IST|Sakshi

నటుడు విశాల్‌కు చైన్నె ప్రత్యేక న్యాయస్థానం అక్షింతలు వేసింది. కోర్టు ధిక్కార కేసు వేయాలంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు.. సినీ ఫైనాన్షియర్‌ అన్బుచెలియన్‌ వద్ద తీసుకున్న అప్పును లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ చెల్లించింది. అందుకుగాను నటుడు విశాల్‌ నిర్మించే చిత్రాల హక్కులను తమ సంస్థకు చెందిన అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. అయితే ఆ మొత్తాన్ని విశాల్‌ లైకా సంస్థకు తిరిగి చెల్లించకపోగా ఆ మధ్య విశాల్‌ కథానాయకుడిగా నటించి, నిర్మించిన వీరమే వాగై చుడుమ్‌ చిత్రాన్ని నిబంధనలను మీరి వేరే సంస్థకు విక్రయించారు.

దీంతో లైకా ప్రొడక్షన్‌న్స్‌ విశాల్‌పై మద్రాసు హైకోర్టులో దాఖలు చేసింది. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి విశాల్‌ ఆస్తుల వివరాలను బ్యాంక్‌ ఖాతాల వివరాలను కోర్టులో సమర్పించాలని ఆదేశించారు. దీంతో విశాల్‌ ఈ కేసుపై రిట్‌ పిటిషన్‌ దాఖలు వేశారు. అయితే డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. అంతేకాకుండా విశాల్‌ కథానాయకుడు నటించిన మార్క్‌ ఆంటోని చిత్ర విడుదలపై స్టే విధించారు. ఆ తర్వాత లైకా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ న్యాయమూర్తి ఆషా సమక్షంలో గతవారం విచారణకు వచ్చింది. అప్పుడు న్యాయమూర్తి విషయాలకు తన ఆస్తులు బ్యాంక్‌ ఖాతాల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించి తర్వాత విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు.

అయితే 19వ విశాల్‌ తన ఆస్తుల వివరాలు కోర్టుకు సమర్పించకపోవడంతో పాటు ఆయనగానీ ఆయన తరఫు న్యాయవాది గానీ కోర్టుకు హాజరు కాలేదు. కాగా ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. నటుడు విశాల్‌ ఆయన తరఫున జూనియర్‌ న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు. దీంతో విశాల్‌ తన ఆస్తులను కోర్టులో పెట్టకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాల్‌ కావాలనే కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ అక్షింతలు వేశారు.ఇది కోర్టు ధిక్కార కేసు కింద వస్తుందని హెచ్చరించారు. దీంతో విశాల్‌ తరఫున హాజరైన జూనియర్‌ న్యాయవాది ఆస్తుల వివరాలను గురువారమే కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. అయితే అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అన్న న్యాయమూర్తి ప్రశ్నకు తమ సీనియర్‌ న్యాయవాది హాజరై ఆ వివరాలను తెలియజేస్తారని బదులిచ్చారు దీంతో న్యాయమూర్తి విచారణను కొద్దిసేపు వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు