Nayanathara : అట్లీపై నయనతార కోపంలో నిజమెంత?

23 Sep, 2023 00:36 IST|Sakshi

తమిళసినిమా: నటి నయనతార దర్శకుడు అట్లీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ప్రచారం. మరి ఇందులో నిజం ఎంత? దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నయనతార తొలిసారిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి నటించిన చిత్రం జవాన్‌.

షారుక్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించి సొంతంగా నిర్మించిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌ యువదర్శకుడు అట్లీ బాలీవుడ్‌ పరిచయం అయ్యారు. కాగా ఈ భారీ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పడుకొనె కూడా నటించిన విషయం తెలిసిందే. చిత్రం ఈనెల 7న విడుదలై బాక్సాఫీస్‌ షేక్‌ చేస్తూ రూ.1000 కోట్ల క్లబ్‌ చేరువలో ఉంది. అలాంటి చిత్రంలో దర్శకుడు తన పాత్రకు సరైన న్యాయం చేయలేదనే అసంతృప్తితో నయనతార ఉన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది.

జవాన్‌ చిత్రంలో నటి దీపిక పడుకొనెకు అతిథి పాత్ర అని చెప్పి ఆమెకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లు నయనతార ఆవేదన చెందుతున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అందుకే నయనతార ఆ చిత్ర ప్రచార కార్యక్రమంలోగానీ, విజయోత్సవ వేడుకల్లోగాని పాల్గొనలేదనేది నెటిజన్ల విశ్లేషణ. అయితే ఈ ప్రచారాన్ని నయనతార వర్గం తీవ్రంగా ఖండిస్తున్నారు. నిజానికి షారుఖ్‌ఖాన్‌ అంటే నయనతారకు చాలా ఇష్టమని అందుకే ఆమె ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారని వారు పేర్కొంటున్నారు.

ఇక చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన లేదన్నది ఆమె పాలసీ అని అందుకే జవాన్‌ చిత్ర ప్రచారంలో కూడా పాల్గొనలేదని అంటున్నారు. అదేవిధంగా ముంబైలో జరిగిన చిత్ర సక్సెస్‌ కార్యక్రమంలో పాల్గొనపోవడానికి కారణం, అదేరోజు నయనతార తల్లి పుట్టినరోజు కావడంతో ఆమె తన తల్లికి ప్రాముఖ్యత ఇచ్చారని చెబుతున్నారు. అయితే దర్శకుడు అట్లీపై నయనతార ఆగ్రహం అని వారు, వీరు అంటుండడమే కానీ నయన మాత్రం ఏవిధంగా స్పందించలేదన్నది గమనార్హం.

మరిన్ని వార్తలు