విజృంభిస్తున్న ఇన్‌ఫ్లూయంజా వైరస్‌

18 Nov, 2023 00:40 IST|Sakshi
● పెరుగుతున్న కేసులు ● విస్తృతంగా వైద్యశిబిరాలు ● ఆరోగ్యశాఖ మంత్రి

సాక్షి, చైన్నె: చైన్నెలో ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ స్వైర విహారం చేస్తోంది. చైన్నె, శివారుల్లో జ్వరాలతో ప్రభుత్వ ఆస్పత్రులు, క్లినిక్‌ల ముందు జనం క్యూకడుతున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. గత కొద్ది రోజులుగా చైన్నె, శివారు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారింది. బుధవారం వరకు వర్షాలు సైతం పడ్డాయి. ప్రస్తుతం చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. శివార్లలో మంచు దుప్పటి కప్పేసినట్టుగా పరిస్థితి అనేక చోట్ల ఉన్నాయి. ఈ వాతావరణ మార్పులతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, జలుబు, ఒంటి నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు అధికంగా ఉన్నారు. ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ విజృంభిస్తున్నట్టుగా పరిశోధనలో తేలడంతో జ్వరాల భయం జనంలో నెలకొంది. జ్వరాలతో క్లినిక్‌లు, ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద బారులు తీరుతున్న వారు అధికంగానే ఉన్నారు. ఈ వైరస్‌కు మరింతగా విజృంభించకుండా కట్టడి చర్యలపై ఆరోగ్యశాఖ దృష్టి పెట్టింది. ఫీవర్‌ క్యాంప్‌లను విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ప్రతి శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ క్యాంపులను నిర్వహిస్తున్నారు చైన్నెలో అదనంగా ఆదివారం పూట కూడా క్యాంపుల నిర్వహణపై అధికారుల పరిశీలిస్తున్నారు. ఈ విషయంగా ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్‌ మాట్లాడుతూ, జ్వరాల కట్టడిపై దృష్టి పెట్టామన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న ఐదు వేల పోస్టులను నెలల రోజుల్లో భర్తీచేయడానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇందుకు సంబంధించిన చర్యలను అధికారులు మొదలెట్టారని తెలిపారు.

మరిన్ని వార్తలు