ప్రముఖ రచయిత్రి మాజేటి జయశ్రీ కన్నుమూత

23 Jul, 2021 06:44 IST|Sakshi

కొరుక్కుపేట: ప్రముఖ రచయిత్రి, తెలుగు తరుణి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ మాజేటి జయశ్రీ(72) ఇకలేరు. గురువారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్, విజయవాడకు చెందిన డాక్టర్‌ మాజేటి జయశ్రీ తల్లిదండ్రులు వ్యాపారరీత్యా చెన్నైలో స్థిరపడ్డారు. మద్రాసు వర్సిటీ నుంచి ఎంఏ పూర్తిచేసిన ఆమె 21వ ఏటనే క్వీన్‌ మేరీస్‌కళాశాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శకురాలుగా నిలిచారు.

2015 సంవత్సరంలో చెన్నైలో తెలుగు భాష పరిరక్షణ, మహిళల సాధికారత దిశగా తెలుగు తరుణి సంస్థను స్థాపించి అనేక సాంస్కృతిక, సంక్షేమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తు వచ్చారు. అనేక సంస్థల నుంచి అవార్డులను అందుకున్న ఆమె రచనల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. సందేశాత్మక పుస్తకాలను రచించి ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్‌ పాఠశాలల కోసం టీటీకే సంస్థ ఆధ్వర్యంలో స్కూల్‌ అట్లాస్‌ రూపొందించారు. ఈమెకు ఇద్దరు కుమారులు. గురువారం సాయంత్రం చెన్నై ఓటేరి శ్మశాన వాటికలో జయశ్రీ దహన సంస్కారాలు పూర్తి చేసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. జయశ్రీ మృతి వార్త తెలుసుకున్న తెలుగు తరుణి అధ్యక్షురాలు కె. రమణి, ఇతర సభ్యులు, తెలుగు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.    

Read latest Tamil-nadu News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు