నిధులిస్తేనే మందికి ఉపాధి అవకాశాలు

5 Jan, 2021 08:01 IST|Sakshi

భారీ పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతుల లేమి..

వచ్చే బడ్జెట్‌లో కేంద్ర సాయం కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం

ఈ ఏడాది నిధులిస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు

సాక్షి, హైదరాబాద్‌ : అవి పేరున్న వివిధ రంగాల పెద్ద ప్రాజెక్టులు.. అందులో ఏ ఒక్కటి పూర్తయినా ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది.. కావాల్సిందల్లా నిధుల సాయమే.. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వివిధ ప్రాజెక్టులను నిధుల కొరత వెంటాడుతోంది.. కేంద్రం కనుక వచ్చే బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తే అవి గట్టెక్కుతాయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 28 వేల ఎకరాల విస్తీర్ణంలో 147 పారిశ్రామిక వాడలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నూతన పారిశ్రామిక విధానం(టీఎస్‌ఐపాస్‌)లో భాగంగా 14 రంగాలకు సంబంధించి పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 59 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం ఇప్పటివరకు 49 వేల ఎకరాలను గుర్తించగా, సుమారు 39 వేల ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు టీఎస్‌ఐఐసీ ఇప్పటివరకు సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్‌ ఫార్మా సిటీ, నిమ్జ్‌ (జహీరాబాద్‌), కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాయాన్ని కోరుతోంది. ఈ ఏడాది వీటిలో మౌలిక వసతుల కల్పన పూర్తయితే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి.

హైదరాబాద్‌ ఫార్మా సిటీ..
ప్రపంచంలోనే అతిపెద్ద సింగి ల్‌ ఫార్మా క్లస్టర్‌ ‘హైదరాబాద్‌ ఫార్మా సిటీ’ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది. 19,333 ఎకరాల్లో ఏర్పాటయ్యే ఫార్మాసిటీ ప్రా జెక్టు వ్యయం రూ.28,700 కోట్లుగా అంచనా వేశారు. జీరో లిక్విడ్‌ డిశ్చార్జి, కామన్‌ ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్, ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్‌ పార్క్, గ్లోబల్‌ ఫార్మా యూనివర్సిటీ, కామన్‌ డ్రగ్‌ డెవలప్‌మెంట్, టెస్టింగ్‌ లేబొరే టరీ, స్టార్టప్‌ల కోసం ప్రత్యేక హబ్‌ తదితరాలను ఫార్మాసిటీ ప్రణాళికలో చేర్చారు. దీనికి కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణి జ్య శాఖ జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్‌) హోదాను ఇచ్చింది. ఫార్మాసిటీని శ్రీశైలం ప్రధాన రహదారితో అనుసంధానం చేస్తూ వంద ఫీట్ల రోడ్డును నిర్మించారు. ఫార్మా సిటీలో అంతర్గత మౌలిక సదుపాయాల కోసం రూ.4,992 కోట్లను ఆశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో కనీసం రూ.870 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఇప్పటికే ఫార్మా రంగానికి చిరునామాగా ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ ఫార్మాసిటీ పూర్తయితే ఔషధ తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుతుంది.

జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్‌)
భవన నిర్మాణాలు, సాగునీటి ప్రాజెక్టు లు, మైనింగ్‌ తదితర రంగాల్లో మౌలిక వసతుల పనుల కోసం ఉపయోగించే యంత్రాల తయారీకి దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక పారిశ్రామిక పార్కు తెలంగాణలో ఏర్పాటు కానున్నది. ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మేకర్స్‌ (ఓఈఎం) ఈ పార్కులో తమ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.  సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పరిసరాల్లో ఏర్పాటయ్యే పారిశ్రామిక పార్కుకు నేషనల్‌ ఇండస్ట్రియల్‌ మ్యానుఫ్యా క్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) హోదాను 2016 జనవరి 7న కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. 12,635 ఎకరాల్లో ఏర్పాటయ్యే నిమ్జ్‌కు రూ.13,300 కోట్లు ప్రాజెక్టు అంచనా వ్యయం కాగా, రూ.60 వేల కోట్ల పెట్టుబడులు, 2.77 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పార్కులో మౌలిక వసతుల కోసం తొలి దశలో రూ.500 కోట్లు ఇవ్వాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. మౌలిక వసతుల కల్పన జరిగితే పరిశ్రమల స్థాపన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంటుంది.

నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌.. 
కేంద్ర వాణిజ్య శాఖకు అనుబంధంగా ఉండే పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగంగా రాష్ట్రంలో నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించిన సవివర నివేదిక (డీపీఆర్‌) ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఆవరణలో 30 ఎకరాల స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దేశంలో డిజైనింగ్‌ పరిశ్రమ సుమారు రూ.19 వేల కోట్లకు చేరుకుంటుందనే అంచనాతో ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. సెంటర్‌ ఏర్పాటు కోసం రూ.200 కోట్ల ప్రాథమిక మూలధనం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌.. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు
ఉపాధి వేటలో పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన నేత కార్మికులను తిరిగి స్వస్థలాలకు రప్పించి ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ రూరల్‌ జిల్లాలో సుమారు 2 వేల ఎకరాల్లో ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు’ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు 1,190 ఎకరాలను టెక్స్‌టైల్‌ పార్కు కోసం సేకరించారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ అనే సంస్థను ప్రాజెక్టు అభివృద్ధి కోసం కన్సల్టెంట్‌గా నియమించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,150.47 కోట్లు కాగా, రూ.11,546 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. పూర్తిస్థాయిలో పెట్టుబడులొస్తే 1.13 లక్షల మందికి ఉపాధి దక్కే అవకాశముంది. పార్కులో మౌలిక వసతులకు అవసరమయ్యే వ్యయంలో సుమారు రూ.500 కోట్ల మేర కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన ‘మెగా టెక్స్‌టైల్‌ పార్కు పథకం’కింద అందించే అవకాశముంది. ఇందులో కనీసం రూ.300 కోట్లు కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో మౌలిక సదుపాయాల కోసం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 10 వేల మందికి ఉపాధి కల్పించేందుకు రూ.700 కోట్లు కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పెట్టుబడులకు యంగ్‌వన్‌ అనే కొరియా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మెగా టెక్స్‌టైల్‌ పార్కు పట్టాలెక్కితే పొరుగు రాష్ట్రాలకు ఉపాధి వేటకు వెళ్లిన నేత కార్మికులు తిరిగి వచ్చే అవకాశముంది.

మెడికల్‌ డివైజెస్‌ పార్కు
వైద్య పరికరాల తయారీ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే తొలిసారిగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ను ఏర్పాటుచేసింది. 250 ఎకరాల్లో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి కాగా, రెండో దశ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. సుమారు రూ.వేయి కోట్ల పెట్టుబడితో 4 వేల మందికి ఉపాధి దక్కుతుందని అంచనా. ఎంఎస్‌టీ, విర్చో, ప్రోమియో, ప్లస్‌ ఆక్టివ్‌ స్టేషన్‌ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అయితే అనుమతులు పొందిన పరిశ్రమల్లో చాలా వరకు ఇంకా పనులు ప్రారంభించలేదు. 

ఇండస్ట్రియల్‌ కారిడార్లకు ప్రాధాన్యత..
రాష్ట్రం మీదుగా వెళ్తున్న ముఖ్యమైన జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న వనరులు, అవకాశాలను జోడించి పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2014 నాటి నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌లో 6 ఇండస్ట్రియల్‌ కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో ఇండస్ట్రియల్‌ క్లస్టర్లు ఏర్పాటు చేయడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించి, జిల్లాల్లోనూ ఉపాధి అవకాశాలు పెంచాలనే ప్రభుత్వ ఉద్దేశం. టీఎస్‌ఐపాస్‌లో భాగంగా హైదరాబాద్‌–వరంగల్, హైదరాబాద్‌–నాగ్‌పూర్, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–మంచిర్యాల, హైదరాబాద్‌ నల్లగొండ, హైదరాబాద్‌–ఖమ్మం ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. తొలి దశలో హైదరాబాద్‌–వరంగల్, హైదరాబాద్‌–నాగ్‌పూర్, హైదరాబాద్‌–బెంగళూరు కారిడార్లు, రెండో దశలో మరో మూడు కారిడార్ల అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ‘హైదరాబాద్‌–వరంగల్‌’ కారిడార్‌కు రూ.3 వేల కోట్లు, ‘హైదరాబాద్‌–నాగ్‌పూర్‌’ కారిడార్‌కు రూ.2 వేల కోట్లు మొత్తంగా 2021–22 కేంద్ర బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేంద్రం నుంచి ఆశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌పై కసరత్తు చేస్తోంది. 

మరిన్ని వార్తలు