సీఎం స్టాలిన్‌ కుమారుడికి భారీ ఊరట

29 Apr, 2022 08:27 IST|Sakshi

సాక్షి, చెన్నై: డీఎంకే యువజన విభాగం నేత, ఎమ్మెల్యే ఉదయ నిధి స్టాలిన్‌కు హైకోర్టులో మరోమారు ఊరట లభించింది. ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తి భారతీ దాసన్‌ బెంచ్‌ తోసి పుచ్చింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేపాక్కం – ట్రిప్లికేన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఉదయ నిధి స్టాలిన్‌ గెలిచారు.

డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ వారసుడిగా, ఆ పార్టీ యువజన ప్రధాన కార్యదర్శిగా ఉదయ నిధి చక్రం తిప్పుతున్నారు. అయితే, ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ తొలుత దేశీయ మక్కల్‌ కట్చి నేత ఎంఎల్‌ రవి కోర్టు తలుపులు తట్టారు. అయితే ఆరోపణలకు సంబంధించి.. ఎలాంటి ఆధారాలు సమర్పించక పోవడంతో ఆదిలోనే పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఆ నియోజకవర్గానికి చెందిన ఓటరు ప్రేమలత పిటిషన్‌ వేశారు. తన మీదున్న కేసుల వివరాల్ని నామినేషన్‌లో ఉదయ నిధి చూపించలేదని, నామినేషన్‌ పత్రాలలోనూ అనేక అనుమానాలు ఉన్నట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన గెలుపు రద్దుచేయాలని కోరారు.

కాగా, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించవద్దు అని ఉదయ నిధి కోర్టులో మరో పిటిషన్‌ వేశారు. గురువారం న్యాయమూర్తి భారతీ దాసన్‌ బెంచ్‌లో ఈ పిటిషన్లు విచారణకు వచ్చింది. ఉదయ నిధి తరపున సీనియర్‌ న్యాయవాది ఎన్‌ఆర్‌ ఇళంగో  వాదనల్ని వినిపించారు. అయితే, పిటిషనర్‌ ప్రేమలత తన ఆరోపణలకు తగిన ఆధారాల్ని కోర్టులో సమర్పించలేదు. దీంతో ఉదయ నిధికి ఊరట కల్గిస్తూ, ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణార్హం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.    

ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా‌ వైరస్‌.. ఇది కచ్చితంగా ఊరట ఇచ్చే విషయమే!

మరిన్ని వార్తలు