సీఎం పళనిస్వామిని పరామర్శించిన ఆర్కే రోజా

21 Oct, 2020 06:31 IST|Sakshi
తవసాయమ్మ చిత్ర పటానికి రోజా నివాళులు

సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామిని వైఎస్సార్‌ సీపీ నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా పరామర్శించారు. సీఎం ఎడపాడి తల్లి తవసాయమ్మ గతవారం అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో సీఎంను పరామర్శించి, సానుభూతి తెలియజేయడానికి రాజకీయాలకు అతీతంగా నేతలు గ్రీన్‌వేస్‌ రోడ్డులోని పళనిస్వామి ఇంటికి వెళ్లి వస్తున్నారు. మంగళవారం ఎండీఎంకే నేత వైగో, సీపీఐ నేత ముత్తరసన్, సినీ నటి, బీజేపీ నేత కుష్బూ, డీఎండీకే నేత సుధీప్‌, సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి పళనిస్వామిని కలిసి సానుభూతి తెలిపారు. ముందుగా భర్త ఆర్కే సెల్వమణితో కలసి రోజా అక్కడకు వచ్చారు. తవసాయమ్మ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. కొంతసేపు పళనిస్వామితో మాట్లాడి తన సానుభూతి తెలియజేశారు.  

వీరులకు వందనం.... 
సాయంత్రం డీజీపీ కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరులకు వందనం సమర్పించే కార్యక్రమం జరిగింది. బుధవారం పోలీసు సంస్మరణ దినోత్సవం. ఈసందర్భాన్ని పురష్కరించుకుని ఇప్పటి వరకు విధుల్లో అమరులైన పోలీసుల పేర్లు, వివరాలను పొందు పరుస్తూ డీజీపీ కార్యాలయం ఆవరణలో శిలాఫలకాన్ని రూపొందించారు. దీనిని సీఎం పళనిస్వామి ఆవిష్కరించారు. అలాగే, అక్కడ ఓ మొక్కను నాటారు. డీజీపీ కార్యాలయంలో పోలీ సుల అధికారులతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, మంత్రులు జయకుమార్, ఎస్పీ వేలుమణి, హోంశాఖ కార్యదర్శి ప్రభాకర్, డీజీపీ త్రిపాఠి, చెన్నై పోలీసుకమిషనర్‌ మహేశ్‌కుమార్‌ అగర్వాల్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు