-

సిటీ బస్సులో సీఎం.. ఆశ్చర్యపోయిన ప్రయాణికులు

8 May, 2022 07:36 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై : వినూత్న రీతిలో ప్రజలకు చేరువయ్యేందుకు యత్నిస్తున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం మరో కొత్త పంథాను అనుసరించారు. చెన్నై సిటీ బస్సులో నిలబడి ప్రయాణికులతో కలిసి కొద్దిసేపు పర్యటించారు. సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని గడిచిన ఎన్నికల మేనిఫెస్టోలో స్టాలిన్‌ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే అమలు చేశారు.

డీఎంకే ప్రభుత్వం ఏర్పడి శనివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా తన ఇంటి నుంచి తండ్రి కరుణానిధి నివసించిన గోపాలపురంలోని ఇంటికి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు మేళతాళాలతో స్టాలిన్‌కు స్వాగతం పలికారు. ఇంటిలోని కరుణానిధి చిత్రపటం వద్ద నివాళులరి్పంచారు. తల్లి దయాళుఅమ్మాళ్‌కు నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతూ స్టెల్లా మెరీస్‌ కాలేజీ వద్ద కారును నిలపమని చెప్పి అనుసరిస్తున్న మంత్రులను వెంట రావద్దని ఆదేశించారు. అక్కడికి సమీపంలోని బస్‌స్టాండ్‌ వద్దకు వెళ్లి పెరంబూరు–బిసెంట్‌నగర్‌ మధ్య ప్రయాణించే 29సి మహిళల ప్రత్యేక బస్సు ఎక్కారు. సిటీ బస్సులో అకస్మాత్తుగా సీఎం స్టాలిన్‌ ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాలకు లోనై లేచి నిలబడ్డారు.

స్టాలిన్‌ వారిని కూర్చోమని చెప్పి సంభాషణ మొదలు పెట్టారు. తన జీవితంలో 29సి రూట్‌ బస్సును మరువలేనన్నారు. చిన్నతనంలో గోపాలపురం నుంచి 29సిలోనే స్కూలుకు వెళ్లానని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకం సౌకర్యంగా ఉందా..? అని ప్రశ్నించగా ప్రయాణికులంతో తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. తనకు రూ.9 వేలు జీతం, ఉచిత ప్రయాణం వల్ల నెలకు రూ.900 మిగులుతోందని ఓ ప్రయాణికురాలు బదులిచ్చారు. ఇలా మిగిలిన సొమ్మును ఏం చేస్తున్నారని స్టాలిన్‌ ప్రశ్నించగా పొదుపు చేస్తున్నట్లు బదులిచ్చారు.

అలాగే బస్సులోని విద్యార్థినులను ‘డీఎంకే ఏడాది ప్రభుత్వం ఎలా ఉందని’ అడగ్గా, చాలా తృప్తిగా ఉందని బదులిచ్చారు. మిమ్మల్ని నేరుగా చూడటం ఆనందంగా ఉందని పేర్కొంటూ పలువురు ప్రయాణికురాళ్లు సెల్‌ఫోన్‌ ద్వారా సెలీ్ఫలు తీసుకున్నారు. సిటీ బస్సులు సమయానికి వస్తున్నాయా..?, ఉచిత టిక్కెట్లను సక్రమంగా ఇస్తున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. సుమారు 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన సీఎం ఆ తరువాత బస్సు దిగి వెనుకనే వస్తున్న కారులో ఎక్కి వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్‌?

మరిన్ని వార్తలు