గ్రామస్తుల త్యాగంతో పిచ్చుక, పిల్లలు క్షేమం

27 Jul, 2020 11:53 IST|Sakshi

పిచ్చుక కోసం నెల రోజులు అంధకారంలో

తమిళనాడులోని ఓ గ్రామంలో విశేషం

సాక్షి, చెన్నై: అరుదైన ఓ పిచ్చుక కోసం ఓ గ్రామం నెల రోజులు అంధకారంలో మునిగింది. ప్రస్తుతం ఆ పిచ్చుక గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతో బయటకు రావడంతో ఆగ్రామం ఆనందంలో మునిగింది. శివగంగై జిల్లా పోత్తకుడి ఓ కుగ్రామం. ఇక్కడ వంద మేరకు ఇళ్లు ఉన్నాయి. ఇక్కడి వీధుల్లో 35 విద్యుత్‌స్తంభాలు ఉన్నాయి. వీటిని ఆన్, ఆఫ్‌ చేయడం బాధ్యతల్ని ఆ గ్రామానికి చెందిన కరుప్పురాజాకు అప్పగించారు. వీటన్నింటికి ఒకే చోట అతి పెద్ద బాక్స్‌గా స్విచ్‌ బోర్డు ఉంది. ఈ పరిస్థితుల్లో నెల రోజుల క్రితం ఓ రోజు అరుదైన పిచ్చుకకు ఆ బాక్సు నుంచి బయటకు వెళ్లడాన్ని కరుప్పురాజా చూశాడు. మరుసటి రోజు అదే విధంగా ఆ పిచ్చుక వెళ్లడం, ఇదేదో అరుదైన జాతికి చెందినదిగా భావించాడు.

క్రమంగా ఆ పిచ్చుక ఆ బాక్సులో గూడు కట్టింది. గుడ్లు పెట్టి పొదిగేందుకు ఆ బాక్సును ఆ పిచ్చుక ఎంపిక చేసుకున్నట్టుంది. ఈ సమాచారాన్ని కరుప్పురాజా గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆ పిచుక వర్ణం అంతా ఓ వింతగా, అరుదుగా ఉండడంతో దీనిని పరరిక్షించాల్సిన బాధ్యత ఉందని గ్రామస్తులు నిర్ణయించారు. దీంతో ఆ పిచ్చుకకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆ స్విచ్‌ బాక్స్‌ వైపుగా ఎవ్వరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో నెల రోజులు ఆ గ్రామంలో వీధి దీపాలు వెలగలేదు. ఆ గ్రామమే అంధకారంలో మునిగినట్టుగా పరిస్థితి మారింది. ఈ పరిస్థితుల్లో గుడ్లు పెట్టి, పొదిగిన ఆ పిచ్చుక నెల రోజుల తర్వాత తన పిల్లలతో బయటకు రావడంతో ఆ గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. ఆ పిచుకను, పిల్లలల్ని పరిరక్షించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు.  

మరిన్ని వార్తలు