పేపర్లు పంపినందుకు  రూ.16 లక్షలు!

24 Jun, 2023 02:56 IST|Sakshi

వాట్సాప్‌ ద్వారా ఏఈఈ, డీఏఓ ప్రశ్నపత్రాలు షేరింగ్‌

మాజీ ఏఈ పూల రమేశ్‌కు సహకరించిన ప్రైవేట్‌ కాలేజీ చైర్మన్‌

గాలించి పట్టుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం

సాక్షి, హైదరాబాద్‌:తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన మాజీ ఏఈ పూల రమేశ్‌కు సహకరించిన ప్రైవేట్‌ కళాశాల చైర్మన్‌ సయ్యద్‌ మహబూబ్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులకు చిక్కాడు. సయ్యద్‌ వాట్సాప్‌ ద్వారా అసి స్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ), డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ) ప్రశ్న పత్రాలను రమేశ్‌కు ‘పంపినందుకు’రూ.16 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

రమేశ్‌ అరెస్టు తర్వాత పరా రీలో ఉన్న సయ్యద్‌ మహబూబ్‌ను బుధ వారం పట్టుకున్న అధికారులు.. అతడిని జ్యుడీషియల్‌ రిమాండ్‌ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సిట్‌ అధికారులు శుక్రవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అత్యాధునిక బ్లూటూత్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను వినియోగించి రమేశ్‌ ఏడుగురితో ఏఈఈ, డీఏఓ పరీక్షలు రాయించాడు. టోలి­చౌకిలోని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీకి మహబూబ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ ఏడాది జనవరి 22, ఫిబ్రవరి 23న జరిగిన ఈ రెండు పరీక్షలకు సంబంధించిన సెంటర్‌ ఈ కాలేజీలోనే పడింది. ఈ నేపథ్యంలో రమేశ్‌తో రూ.16 లక్షలకు ఒప్పందం చేసుకున్న మహ­బూబ్‌.. పరీక్ష ప్రారంభమైన పది నిమిషాల్లోనే ప్రశ్నపత్రాలను తన సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి, రమే­శ్‌కు వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేశాడు. ఆయా పరీక్ష­లకు గైర్హాజరైన వారి పేపర్లను దీనికి వినియోగించాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలను చాట్‌ జీపీటీ ద్వారా వెతికి, ఏడుగురు అభ్యర్థులకు అత్యాధునిక పరికరాల ద్వారా అందించే టీమ్‌కు రమేశ్‌ మలక్‌పేటలోని మహ్మద్‌ ఖాలేద్‌ ఇంట్లో షెల్టర్‌ ఏర్పాటు చేశాడు. దీని కోసం ఖాలేద్‌కు రూ.80 వేలు చెల్లించాడు.

ఈ రెండు రోజులూ ఈ బృందం అక్కడ నుంచే జవాబులను అభ్యర్థులకు పంపింది. గత నెలలో రమేశ్‌ అరెస్టు అయిన నాటి నుంచి మహబూబ్‌తోపాటు ఖాలేద్, అభ్యర్థులు, వారికి సహకరించిన వారు పరారీలో ఉన్నారు. ఇప్పటివరకు సిట్‌ అధికారులు ముగ్గురు అభ్య­ర్థులతో పాటు ఈ నెల 9న ఖాలేద్‌ను, బుధవారం మహబూబ్‌ను పట్టుకున్నారు. మరో 35 మంది అభ్యర్థుల కోసం సిట్‌ అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు.

ఈ హైటెక్‌ మాస్‌ కాపీయింగ్, ఏఈ పేపర్‌ లీకేజ్‌ ద్వారా రమేశ్‌ రూ.10 కోట్లు ఆర్జించాలని భావించినట్లు తెలుస్తోంది. హైటెక్‌ కాపీయింగ్‌ ద్వారా లబ్ధిపొందిన ఒక్కో అభ్యర్థి రూ.40 లక్షలు, ఏఈ పేపర్‌ లీక్‌ ద్వారా లబ్ధిపొందిన ఒక్కొక్కరు రూ.20 లక్షలు చెల్లించేలా రమేశ్‌ ఒప్పందాలు చేసుకున్నాడని సమాచారం. అయితే ఇతడికి ఇప్పటివరకు రూ.1.1 కోటి మాత్రమే ముట్టినట్లు తేలింది. 

మరిన్ని వార్తలు