Hyderabad: హిందీ నేర్చుకుంటూ.. ఆదాయం అందుకుంటూ..

6 Jul, 2023 04:17 IST|Sakshi

విదేశీ రోగులకు, ఆసుపత్రులకు మధ్య వారధులుగా ఆఫ్రికన్లు 

ఫెసిలిటేటర్లుగా అవతారమెత్తుతున్న మాజీ రోగులు, విదేశీ విద్యార్థులు 

హైదరాబాద్‌ నగర వైద్యరంగంతో మమేకమవుతున్న వైనం 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలోని రిసెప్షన్‌లో ఉన్న వ్యక్తుల్ని ‘‘కిత్నా రూపియా టెస్ట్‌ కే లియే? (పరీక్షలకు ఎంత ఖర్చవుతుంది?)’’అని ఆఫ్రికాకు చెందిన కవాంగు(25) అడుగుతోంది. కెన్యా నుంచి న్యూరో సర్జన్‌ను సంప్రదించడానికి నగరానికి వచ్చిన ముగ్గురు రోగులు తనకు కస్టమర్లుగా ఉన్నారు. వారికి అవసరమైన సంప్రదింపులు, పరీక్షల ఏర్పాట్ల నుంచి రెస్టారెంట్‌లో ఆహారాన్ని ఆర్డర్‌ చేయడం దాకా అన్నీ కవాంగు బాధ్యతలే.

విదేశీయులకు అత్యున్నత వైద్యసేవల్ని మాత్రమే కాదు ఆదాయమార్గాలను కూడా నగర వైద్యం అందిస్తున్న తీరుకు కువాంగు ఒక ఉదాహరణ. తన కుటుంబంతో నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చి అలాంటి ఫెసిలిటేటర్‌ సహాయంతో సంక్లిష్టమైన కాలేయ సమస్యకు కవాంగు చికిత్స పొందింది.

ఆ తర్వాత తానే ఫెసిలిటేటర్‌గా మారితే రోజుకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు సంపాదించవచ్చని అర్థమయ్యాక కవాంగు మూడేళ్లుగా అదే పనిచేస్తూ నగరంలోనే ఉంటున్నారు. ఆ వృత్తి కోసం కొంచెం హిందీ కూడా నేర్చుకుందామె. ‘హిందీ భాష నేర్చుకోవడం కోసం కోర్సులో చేరడంతోపాటు బాలీవుడ్‌ సినిమాలు చూడటం ప్రారంభించాను‘అని ఆమె చెప్పారు. 

టోలీచౌకి కేంద్రంగా...  
ఫెసిలిటేటర్లుగా వ్యవహరిస్తున్నవారికి కేంద్రంగా నగరంలోని టోలీచౌకి మారిందని ఓ ఆసుపత్రికి చెందిన మార్కెటింగ్‌ విభాగ ప్రతినిధి తెలిపారు. ఈ ఏరియాలోని ప్రీమియర్‌ అపార్ట్‌మెంట్‌లో అద్దెకుండేవారిలో అత్యధికులు ఈ తరహా సేవల్లో నిమగ్నమవుతున్నారన్నారు. చాలామంది ఇక్కడ ట్రావెల్‌ లేదా స్టడీ వీసాపై మాత్రమే ఉన్నారు.

కాబట్టి ఫారినర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్ యాక్ట్‌కి సంబంధించిన సమస్యల గురించి భయపడివారు తమపేరు తదితర వ్యక్తిగత వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు, ‘‘మాకు క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు నైరోబీలోని ప్రధాన కార్పొరేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు మాకు సహాయం చేస్తారు’’అని నైరోబీకి చెందిన మార్గరెట్‌ కారీ చెప్పారు. కొన్ని ఆసుపత్రులు దేశీయ రోగులతో పోలిస్తే అంతర్జాతీయ రోగులకు ట్రీట్‌మెంట్‌ రేట్లు అమాంతం 50 శాతం మేర పెంచేసి వసూలు చేస్తున్నారు.

ఇలాంటి ఆసుపత్రులు ఫెసిలిటేటర్లకు బిల్లును బట్టి 15 నుంచి 20 శాతం కూడా ఇస్తున్నారని సమాచారం. ‘సోమాలియాలో ఆరోగ్య సంరక్షణకు సరైన మౌలిక సదుపాయాలు లేవు. దాంతో చికిత్స కోసం థాయ్‌లాండ్, మలేషియా, చైనాకు వెళ్లేవారు.

కానీ, ఇప్పుడు చాలామంది భారతదేశానికి, అందులోనూ హైదరాబాద్‌కు వస్తున్నారు, అందువల్ల నేనిక్కడ ఉంటూ బంధువులు, స్నేహితులకు సహాయం చేయడం ప్రారంభించాను. అలా చాలామంది నాతో కనెక్ట్‌ అయ్యారు’అని 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన సోమాలియా జాతీయుడైన జువేద్‌ అన్నారు.  

ఏజెన్సీలూ ఉన్నాయి... 
మెడికల్‌ టూరిజమ్‌ సేవలు అందించే కొన్ని అంతర్జాతీయ కంపెనీలు చట్టప్రకారం కొందరిని ఫెసిలిటేటర్లుగా నియమించుకుని రోగులకు సహాయకులుగా వినియోగిస్తాయి. ఇలాంటి సంస్థలు ఢిల్లీ, ముంబై, బెంగుళూర్‌లలో ఎక్కువ. వాటి సేవలు హైదరాబాద్‌కు ఇంకా విస్తృతంగా వ్యాపించలేదు. దాంతో ఇక్కడ వ్యక్తిగతంగా సేవలు అందించే ఫెసిలిటేటర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి.

వీటిని అందిపుచ్చుకుంటున్న విదేశీ విద్యార్థులు నగరంలోని హైదరాబాద్, ఉస్మానియా వంటి యూనివర్సిటీల్లో చదువుకుంటూ పార్ట్‌టైమ్‌గా ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. పదేళ్లు, పన్నెండేళ్ల పాటు నర్సింగ్‌ స్టాఫ్, ఫిజియోథెరపీ స్టాఫ్‌గా సేవలు అందించినవాళ్లు కూడా జోర్డాన్, ఇరాక్, సిరియా తదితర మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి వచ్చి అక్కడి పరిచయాలను, అరబిక్‌ భాష మీద పట్టు లాంటి సానుకూల అంశాలతో ఫెసిలిటేటర్ల అవతారం ఎత్తుతున్నారు.  

ఉభయ కుశలోపరి విధానం 
మా ఆసుపత్రికి నైజీరియా, కెన్యా, సుడాన్, సోమాలియా తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. వీరి కోసం మేం అధికారికంగా ఉన్న సంస్థల నుంచి ఫెసిలిటేటర్ల సేవలు అందుకుంటాం. అరుదుగా మాత్రం తెలిసిన, పరిచయస్తులను ఉపయోగించుకుంటాం.

రోగులకు ఎదురయ్యే భాషా పరమైన ఇతర అవరోధాలకు పరిష్కారంగానూ, మరోవైపు ఇక్కడ విద్యార్జన తదితర పనులపై వచ్చేవారికి ఆదాయమార్గంగానూ ఈ విధానం ఉపకరిస్తోంది.   –డా.కిషోర్‌రెడ్డి, అమోర్‌ ఆసుపత్రి 

మరిన్ని వార్తలు