నాయకత్వ శిక్షణ

6 Jun, 2023 03:04 IST|Sakshi

సుపరిపాలన అందించే దిశగా నాయకులను తీర్చిదిద్దుతాం

భారత్‌ భవన్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 

సమాజాభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది

ఇందుకోసం రాజకీయంతోపాటు అన్ని రంగాల్లో బోధన, శిక్షణ అవసరం 

భారత్‌ భవన్‌లో అన్నీ అందుబాటులో ఉంటాయి..

తరగతి గదులు, డిజిటల్‌ లైబ్రరీలు, గ్రంథాలు, సమాచార కేంద్రాలు..

అనుభవజ్ఞులైన మేధావులు, నోబెల్‌ లారెట్లతో నాయకత్వ శిక్షణ

మణికొండ (హైదరాబాద్‌): దేశ ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకుంటూ పనిచేసే సమర్ధవంతమైన నాయకత్వం వర్తమాన దేశానికి అవసరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు చెప్పారు. సమాజాభివృద్ధికి దోహదం చేసే దిశగా నాయకత్వాన్ని తీర్చిదిద్దు కోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఇందుకోసం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సైద్ధాంతిక రంగాల్లో బోధన, శిక్షణ అవసరమని తెలిపారు. వీటన్నిటినీ ఒకేచోట అందించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగానే భారత్‌ భవన్‌ (సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌) నిర్మాణం చేపడుతున్నామన్నారు.

సోమవారం హైదరాబాద్‌ నగర శివారు కోకాపేటలో 15 అంతస్తులతో నిర్మిస్తున్న భారత్‌ భవన్‌ పనులను సీఎం ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ సమర్థత, మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా భారత్‌ భవన్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చెప్పారు.

దేశం నలుమూలల నుంచి వచ్చే సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులకు ఇక్కడ సమగ్ర, సమస్త సమాచారం అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన మేధావులు, నోబెల్‌ లారెట్లతో నాయకత్వ శిక్షణ ఇప్పిస్తామని, తద్వారా భారత ప్రజాస్వామిక సౌధాన్ని మరింత పటిష్టం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.  

సౌకర్యాలు ఎన్నో..
భారత్‌ భవన్‌లో శిక్షణకు వచ్చే వారికి విలాసవంతమైన వసతులతో పాటు తరగతి గదులు, ప్రొజెక్టర్‌లతో కూడిన చిన్న, విశాలమైన సమావేశ మందిరాలు ఉంటాయని కేసీఆర్‌ తెలిపారు. అత్యాధునిక సాంకేతికత కలిగిన డిజిటల్‌ లైబ్రరీలు, ప్రపంచ మేధావుల రచనలు, గ్రంథాలు, స్థానిక, దేశీయ, అంతర్జాతీయ మీడియా చానల్స్‌ సమాచార కేంద్రాలుండే ఏర్పాటు చేస్తామన్నారు. దేశ, విదేశీ వార్తా పత్రికలు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో చోటు చేసుకునే పురోగతిని పరిశీలించే వేదికలు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.

వార్తలు, కథనాలను ఎప్పటికపుడు అధ్యయనం చేస్తూ విశ్లేషించి, క్రోడీకరించే వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రజలను నిత్యం ప్రభావితం చేస్తున్న సామాజిక మాధ్యమాలపై అవగాహన కొరకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఉంటాయని తెలిపారు. మీడియా రంగంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా సీనియర్‌ టెక్నికల్‌ బృందాలు సైతం ఇక్కడ పనిచేస్తాయన్నారు. భారత్‌ భవన్‌కు కేటాయించిన 11 ఎకరాల స్థలంలో కొంత మేరకే నిర్మాణం చేపట్టి ఎక్కువ శాతం పచ్చదనం నింపి ఆహ్లాదకర వాతావరణంలో శిక్షణ, బోధన కొనసాగించే ఏర్పాట్లు చేస్తామని సీఎం చెప్పారు.  

భారత్‌ భవన్‌ పనులను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి తదితరులు 

భూ వరాహ హోమం..
శంకుస్థాపన కార్యక్రమానికి ముందు వేదపండితులు నిర్వహించిన భూ వరాహ హోమం పూజల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. భవన నిర్మాణ స్థలమంతా కలియ దిరిగి నాలుగు మూలలా సరిహద్దుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతర్గత రోడ్లు, భవన నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ, అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భవన్‌ ఆవరణలో మొక్కను నాటారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, పి.సబితారెడ్డి, మల్లారెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, ఎంపీలు డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి, నామా నాగేశ్వర్‌రావు, జోగినిపల్లి సంతోష్‌కుమార్, బీబీ పాటిల్, దామోదర్‌రావు, బి.లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదనాచారి, కవిత, శేరి సుభాష్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, మహేందర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, గోరటి వెంకన్న, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు టి.ప్రకాశ్‌గౌడ్, దానం నాగేందర్, కాలె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు