ధరణిని వద్దన్న కాంగ్రెస్‌.. బంగాళాఖాతంలోకే!

5 Jun, 2023 03:31 IST|Sakshi
ఆదివారం నిర్మల్‌ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌

నిర్మల్‌ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫైర్‌ 

50 ఏళ్లు పాలించిన దుర్మార్గులు చేసిందేమిటి? 

ఎవరి భూమి ఎవరి చేతిలో ఉందో తెలిసేది కాదు 

తెల్లారేసరికే పహాణీలు మారిపోయేవి 

ధరణితో ఆ బాధ తీరింది.. రైతుబంధు, బీమా వస్తోంది

కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధు, దళితబంధు ఆగిపోతాయని వ్యాఖ్య 

నిర్మల్‌ సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి 

బాసర సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు త్వరలో పునాదిరాయి వేస్తానని వెల్లడి 

జిల్లాకు ఇంజనీరింగ్‌ కాలేజీతోపాటు పలు వరాలు 

నిర్మల్‌: రైతులకు ఎంతో మేలు చేస్తున్న ధరణి పోర్టల్‌ను తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని.. ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్‌ దుర్మార్గులనే బంగాళాఖాతంలోకి విసిరేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ధరణితోనే రైతుల ఖాతాల్లో రైతు బంధు, రైతు బీమా సొమ్ములు పడుతున్న విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలోనే వీఆర్వోల దోపిడీ, పహాణీలు, భూమి రికార్డులు మార్చేయడం వంటి ఎన్నో అక్రమాలు జరిగాయని.. వాటికి చెక్‌ పెట్టేందుకే ధరణిని తెచ్చామని చెప్పారు.

అలాంటి కాంగ్రెస్‌ మళ్లీ వస్తే రైతు బంధు, దళిత బంధు పథకాలు ఆగిపోతాయని పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో రూ.56 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ సముదాయంతోపాటు బీఆర్‌ఎస్‌ భవన్, మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రారంభం, పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం స్థానిక క్రషర్‌ గ్రౌండ్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. సభ ప్రారంభమయ్యే సమయంలో కాసేపు వర్షం కురిసింది. అయినా ప్రజలు వేచి ఉన్నారు. కేసీఆర్‌ కూడా తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు. 

అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ 
దేశంలో రైతులకు మేలు చేస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదేనని, దేశమంతా తెలంగాణ వైపే చూస్తోందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ పక్కా అన్నారు. ‘‘మహారాష్ట్రకు వెళ్లినప్పుడు అక్కడి రైతులు రైతుబంధు డబ్బులను ఖాతాల్లో జమ చేస్తారా? రైతు బీమా పైసలు నేరుగా నామినీ ఖాతాలో వేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్‌.. మాకు మీరు కావాలె. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అని అక్కడా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు..’’అని కేసీఆర్‌ చెప్పారు. 

దోపిడీని ఆపేందుకే ధరణి 
ధరణి పోర్టల్‌ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ నేతలపై సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ‘‘రైతులకు మేలు చేస్తున్న ధరణి పోర్టల్‌ను తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామంటారా? ధరణితోనే రైతులకు రైతుబంధు, రైతుబీమా డబ్బులు ఖాతాలలో పడుతున్న విషయం వాళ్లకు తెలుసా? ఇప్పుడు ధరణి వద్దంటున్న దుర్మార్గులు 50ఏళ్లపాటు పాలించారు. రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపిడీ జరిగేది. కాంగ్రెస్‌ హయాంలోనే వీఆర్వోల దోపిడీ, పహణీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం చూశాం.

ఎవరి భూమి ఎవరి చేతుల్లో ఉండేదో తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమి తెల్లారేసరికి పహాణీలు మారిపోయేవి. ధరణితో ఆ సమస్యలన్నీ తీరాయి. ఇలాంటి ధరణి ఉండొద్దా? ధరణి పోర్టల్‌ను తీసివేస్తామంటున్న కాంగ్రెస్‌ దుర్మార్గులనే బంగాళాఖాతంలో విసిరేయాలి..’’అని కేసీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో దోపిడీతో బాధలు పడ్డామని.. మళ్లీ కాంగ్రెస్‌ వస్తే రైతు బంధుకు రాంరాం, దళితబంధుకు జైభీం అంటూ ముగింపు పలుకుతారని కేసీఆర్‌ పేర్కొన్నారు.  

వేల కోట్లతో ఉచిత్‌ విద్యుత్‌ ఇస్తున్నాం.. 
రాష్ట్రంలో పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని.. డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఒకప్పుడు కరెంట్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని.. ఇప్పుడు తెలంగాణలో 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు. రూ.12 వేల కోట్లు ఖర్చుపెట్టి ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని.. రైతులకు ఎన్ని మీటర్లు పెట్టావని అడిగేవారే లేరని పేర్కొన్నారు. 

ఉద్యోగుల కృషితో అద్భుత ఫలితాలు 
కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ వచ్చాక సమష్టిగా కృషి చేసి అద్భుత ఫలితాలు సాధించగలిగామన్నారు. ఆసిఫాబాద్‌ లాంటి అటవీ ప్రాంతంలో కూడా మెడికల్‌ కాలేజీ వచ్చిందని.. ముఖ్రా(కే) గ్రామం జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకొని మనకు గౌరవం తెచ్చిపెట్టిందని చెప్పారు. ఇందుకు అధికారుల కృషే కారణమని అభినందించారు. దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల్లో నిరుపేదలు ఉన్నారని, వారికోసం చేయాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు.

ఎన్నికల తర్వాత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, రాబోయే రోజుల్లో పోడు భూముల పంపిణీని బ్రహ్మాండంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, విఠల్‌రెడ్డి, రేఖానాయక్, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఐడీసీ చైర్మన్‌ వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. 
 
నిర్మల్‌ జిల్లాకు సీఎం వరాలు 
తన పర్యటన సందర్భంగా నిర్మల్‌ జిల్లాకు కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున, 19 మండల కేంద్రాలకు రూ.20 లక్షల చొప్పున.. నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరిక మేరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీని మంజూరు చేస్తున్నామని.. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో దానిని ప్రారంభిస్తామని తెలిపారు. ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో నిర్మల్‌ జిల్లా నంబర్‌ వన్‌గా నిలవడంపై టీచర్లు, విద్యార్థులను అభినందించారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేస్తామని.. దీనికి పునాదిరాయి వేసేందుకు త్వరలోనే బాసరకు వస్తానని కేసీఆర్‌ తెలిపారు. 

మండలం సార్‌.. చూసిన.. చూసిన.. 
బోథ్‌: ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం సొనాలను మండలంగా ఏర్పాటు చేయాలంటూ సొనాల, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిర్మల్‌ సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ మేరకు గట్టిగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్‌ దానిపై స్పందిస్తూ.. ‘చూసిన.. చూసిన..’ అని సమాధానమిచ్చారు. దీంతో తమ విజ్ఞప్తి సీఎం దృష్టికి వెళ్లిందని సొనాల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు