మండే ఎండల్లోనూ నిండుగా నీళ్లు

6 Jun, 2023 05:20 IST|Sakshi

ఎగువ నుంచి వచ్చిన వరదనీటితో నిండిన మూసీ ప్రాజెక్టు 

ఒక గేటు ఎత్తి 330 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల  

కేతేపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు సోమవారం ఉదయం ఒక క్రస్టు గేటును పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. జూన్‌ మొదటి వారంలోనే గేట్లు ఎత్తడం ప్రాజెక్టు చరిత్రలో ఇదే మొదటిసారని చెపుతున్నారు. గత ఏడాది జూన్‌ 27న గేట్లు ఎత్తారు. గత నెల రోజులుగా హైదరాబాద్‌ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాలలో కురిసిన అకాల వర్షాలతో ఈ ప్రాజెక్టు వేసవిలోనే నిండుకుండలా మారింది.

నెల రోజుల నుంచి మూసీ, బిక్కేరు వాగుల ద్వారా నిరంతరాయంగా నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా సోమవారం ఉదయానికి నీటిమట్టం 644.60 అడుగులకు (4.36 టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి మూసీ ప్రాజెక్టులోకి 240 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువలోకి రావటంతో డ్యామ్‌ అధికారులు మూడో నంబర్‌ క్రస్ట్‌ గేటును అర అడుగు మేర పైకి ఎత్తి 330 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. 644.5 అడుగుల వద్ద నీటిమట్టాన్ని నిలకడగా ఉంచుతూ ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు