వానర రహస్యం రట్టయ్యిందా?

3 Jun, 2023 04:45 IST|Sakshi

మనుషులతో పోలిస్తే కోతుల్లోవ్యాధులు లేకపోవడంపై భారీ అధ్యయనం 

233 వానర జాతులకు చెందిన 809 జన్యుక్రమాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు 

భారత్‌లో 19 వానర జాతులకు చెందిన 83 నమూనాలను విశ్లేషించిన సీసీఎంబీ 

సాక్షి, హైదరాబాద్‌: మన జన్యువుల్లో ఒక చిన్న మార్పు ఉన్నా ఏదో ఒక రకమైన వ్యాధికి గురికావడం ఖాయం. కానీ మనిషికి అతిదగ్గరి చుట్టంగా చెప్పుకొనే వానరాల్లో మాత్రం ఇలా ఉండదు. జన్యుపరమైన మార్పులు ఎన్ని ఉన్నా వాటికి మనలా వ్యాధులు అంటవు. ఎందుకిలా? ఈ విషయాన్ని తెలుసుకొనేందుకే హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) సహా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఓ భారీ అధ్యయనాన్ని చేపట్టి పూర్తి చేశారు.

ఇందులో భాగంగా సుమారు 233 వానర జాతులకు చెందిన 809 జన్యుక్రమాలను మానవ జన్యుక్రమాలతో పోల్చి చూశారు. భారత్‌లోని 19 వానర జాతులకు సంబంధించిన 83 నమూనాల జన్యుక్రమ నమోదు, విశ్లేషణ బాధ్యతలను సీసీఎంబీ చేపట్టింది. అంతరించిపోతున్న వానర జాతుల సంరక్షణకు, జన్యుపరమైన వ్యాధులను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా. 

ప్రత్యేకమైన జన్యుమార్పులు గుర్తింపు... 
మానవ, వానర జన్యుక్రమాలను పోల్చి చూసినప్పుడు రెండింటిలోనూ సుమారు 43 లక్షల మిస్‌సెన్స్‌ జన్యుమార్పులు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ప్రత్యేకమైన జన్యు మార్పులు శరీరానికి అవసరమైన అమైనోయాసిడ్ల రూపురేఖలను మార్చేస్తాయి. ఫలితంగా ఈ అమైనో యాసిడ్లతో తయారయ్యే ప్రొటీన్లు కూడా సక్రమంగా పనిచేయకుండా మనం వ్యాధుల బారిన పడుతూంటాం. అయితే ప్రస్తుతం ఏ మార్పుల కారణంగా మనకు వ్యాధులు వస్తున్నాయన్నది గుర్తించడంలో చాలా పరిమితులున్నాయి. జన్యుమార్పులు వందలు, వేల సంఖ్యలో ఉండటం దీనికి కారణం.

మధుమేహం, గుండె జబ్బుల్లాంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకూ జన్యుపరమైన మూలకారణం ఇప్పటివరకూ తెలియకపోవడానికి కూడా జన్యు మార్పులకు సంబంధించిన సమాచారం లేకపోవడమూ ఒక కారణం. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు... వానరులు, మనుషుల జన్యుక్రమాలను సరిపోల్చే పరిశోధ న చేపట్టారు. కొన్ని వ్యాధులు ఒకటి కంటే ఎక్కువ జన్యువు ల్లో వచ్చిన మార్పుల వల్ల పుడతాయని... మొదట్లో వాటి ప్ర భావం తక్కువగానే ఉన్నా క్రమక్రమంగా ఈ జన్యుమార్పుల న్నీ కలసికట్టుగా పనిచేయడం మొదలుపెట్టి మధుమేహం, కేన్సర్‌ వంటి వ్యాధులుగా పరిణమిస్తాయని అంచనా. 

కొన్నింటిని గుర్తించాం... 
మానవులు, వానరాలను వేరు చేసే 43 లక్షల ప్రత్యేకమైన జన్యుమార్పులు (మిస్‌సెన్స్‌ మ్యుటేషన్స్‌)లలో ఆరు శాతం వాటిని ఇప్పటికే గుర్తించామని, ఇవి మనుషుల కంటే వానరాల్లోనే చాలా ఎక్కువగా ఉన్నాయని కృత్రిమ మేధ కంపెనీ ఇల్యూమినా ఉపాధ్యక్షుడు కైల్‌ ఫార్‌ తెలిపారు. ఈ ఆరు శాతం జన్యుమార్పులు మానవ వ్యాధులు వానరాలకు అంటకుండా కాపాడుతున్నట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాధికారక జన్యుమార్పులను గుర్తించేందుకు తాము ప్రైమేట్‌ ఏఐ–3డీ అనే డీప్‌ లెరి్నంగ్‌ అల్గారిథమ్‌ను ఉపయోగించామని చెప్పారు. ఈ అల్గారిథమ్‌ జన్యుశాస్త్రానికి సంబంధించిన చాట్‌జీపీటీ అనుకోవచ్చు. చాట్‌జీపీటీ మనుషుల భాషను అర్థం చేసుకుంటే ప్రైమేట్‌ ఏఐ–3డీ జన్యుక్రమాన్ని అర్థం చేసుకోగలదు. అంతే తేడా! 

విస్తృత స్థాయిలో వానర జన్యుక్రమం నమోదు... 
ఈ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకానేక వానర జాతుల జన్యుక్రమాలను నమోదు చేశారు. ‘‘ఐదు గ్రాముల బరువుండే చిన్న కోతి మొదలుకొని చింపాంజీల వరకూ... భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే వెస్టర్న్‌ హూలాక్‌ గిబ్బన్, పశ్చిమ కనుమల్లో నివసించే లయన్‌ టెయిల్డ్‌ మకాక్‌ వరకు అనేక వానర రకాల జన్యుక్రమాలను ఇందులో నమోదు చేశారు. ఈ స్థాయిలో వానర జన్యుక్రమ నమోదు జరగడం ఇదే మొదటిసారి’’అని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ గోవింద స్వామి ఉమాపతి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.

భూమ్మీద ఉన్న మొత్తం వానర జాతుల్లో దాదాపు సగం జాతుల జన్యుక్రమం ఇప్పుడు అందుబాటులో ఉందని అంచనా. ఈ విస్తృతస్థాయి జన్యుక్రమం ఫలితంగా వానరాల జన్యుక్రమాలను పోల్చి చూడటం సాధ్యమైందని, తద్వారా పరిణామ క్రమంలో వాటిలో వచ్చిన మార్పులను కూడా పరిశీలించే అవకాశం దక్కిందని డాక్టర్‌ ఉమాపతి తెలిపారు. అంతేకాకుండా వానరాలను మనుషులను వేరు చేసే అంశాలేమిటన్నది కూడా మరింత స్పష్టమవుతుందన్నారు.

జన్యుక్రమాలు అందుబాటులోకి రావడం పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా... మనకు వచ్చే వ్యాధుల వివరాలు తెలుసుకోవడానికి, వానరాల సంరక్షణకూ ఉపయోగపడుతుందని వివరించారు. ‘‘వానర జన్యుక్రమ నమోదు.. వాటిని సంరక్షించాల్సిన అవసరాన్ని మరింత గట్టిగా చెబుతున్నాయి’’అని సీసీఎంబీ డైరెక్టర్‌ వ్యాఖ్యానించారు. ఈ అధ్యయనం ఫలితం ఇంకొకటి కూడా ఉంది. మనిషికి మాత్రమే ప్రత్యేకమనుకున్న జన్యుపరమైన అంశాలు దాదాపు సగం తగ్గాయి! అంటే మనిషికి.. వానరానికి మధ్య ఉన్న అంతరం మరింత తగ్గిందన్నమాట!  

మరిన్ని వార్తలు