ఏడాదిన్నర క్రితం పెళ్లి.. భర్త మృతి.. ‘విషయం ఉదయం తెలిస్తే సాయంత్రం వస్తారా...’

1 Jun, 2023 10:44 IST|Sakshi

వరంగల్: జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని నెల్లుట్లకు చెందిన తాండ్ర శ్రీకాంత్‌ (30) బుధవారం తెల్లవారు జామున నెల్లుట్ల శివారు ఆర్టీసీ కాలనీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. నెల్లుట్లకు చెందిన తాండ్ర శ్రీకాంత్‌కు పాలకుర్తి మండలం బమ్మెరకు చెందిన నందిని అలియాస్‌ అక్షరతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది.

శ్రీకాంత్‌కు నలుగురు అన్నదమ్ములు కావడంతో ఇల్లు సరిపోక కొద్ది రోజులు అద్దె ఇళ్లలో ఉన్నాడు. భార్యభర్తలు ఇద్దరు తరచుగా గొడవ పడడంతో అక్షర మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఉంటున్న హైదరాబాద్‌ అంబర్‌పేటకు వెళ్లింది.

అక్కడే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో భార్యభర్తలు ఇద్దరికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. 15 రోజుల క్రితమే అత్తగారింటికి వచ్చిన అక్షర నెల్లుట్ల సమీపంలోని ఆర్టీసీ కాలనీలో భర్తతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం భర్త శ్రీకాంత్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అక్షర అతని కుటుంబ సభ్యులకు తెలియజేయగా బంధువులు, అన్నదమ్ములు అక్కడికి వెళ్లగా మంచం సమీపంలో నేలపై పడుకొని చనిపోయి ఉన్నాడు.

ఉరి వేసుకున్నాడని చెబుతున్నప్పటికీ, మృతదేహం నేలమీద ఎందుకు ఉందని బంధువులు ప్రశ్నించగా నేనే ఉరితాడు కోసేశానని చెప్పుతూ ఇంట్లో టీవీ చూస్తూ పాటలు వింటుండడంతో మరింత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రవీణ్‌ సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

అనంతరం మృతుడి భార్య అక్షరను పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్షర తల్లి, బంధువులు కారులో సాయంత్రం నాలుగున్నర గంటలకు నేరుగా పోలీసుస్టేషన్‌కు చేరుకోగానే అక్కడే ఉన్న బంధువులు.. శ్రీకాంత్‌ చనిపోయిన విషయం ఉదయం ఏడుగంటలకు తెలిస్తే సాయంత్రం నాలుగు గంటలకు వస్తారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి ప్రయత్నించారు.

దీంతో పోలీసులు అడ్డుకోవడంతో బంధువులతో వాగ్వాదం నెలకొంది.  అప్పుడే పోలీసేస్టేషన్‌కు చేరుకున్న ఎస్సై ప్రవీణ్‌ అందరిని స్టేషన్‌ బయటకు పంపించి మృతుడు శ్రీకాంత్‌ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు