ప్రీతి కేసు నిందితుడు సైఫ్‌ను ఏడాదిపాటు సస్పెండ్‌ చేసిన కేఎంసీ

10 Jun, 2023 11:12 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌లో కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్‌ను కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారు. సైఫ్ ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా బెయిల్‌పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే.

సైఫ్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియాలజీలో పీజీ సెకండియర్ స్టూడెంట్. కులం తక్కువ అంటూ హేళన చేస్తూ మానసికంగా వేధించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రీతి ఎంజీఎంలో మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి నిమ్స్‌లో చికిత్స పొందుతూ 26న మృతి చెందింది.

సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ర్యాగింగ్ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సిఫారసుల మేరకు సైఫ్‌ను గత మార్చి 4 నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సంవత్సర కాలంలో సైఫ్‌కు  అకడమిక్స్, థియరీ ప్రాక్టికల్ క్లాసులు, లైబ్రరీ, హాస్టల్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు.

చదవండి: తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. మళ్లీ తెరపైకి పంచాయితీ 

మరిన్ని వార్తలు