మధ్యవర్తిత్వంతో కోర్టులపై భారం తగ్గింపు 

5 Jun, 2023 05:08 IST|Sakshi

విపరీత ఒత్తిడి ఏ వ్యవస్థకూ మంచిది కాదు 

ఈఎండబ్ల్యూ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై 

మధ్యవర్తిత్వ వ్యవస్థ పటిష్టం కావాలి: హైకోర్టు సీజే ఉజ్జల్‌ భూయాన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఏదైనా వ్యవస్థపై అది భరించే శక్తికి మించి ఒత్తిడి పెంచితే ఆ వ్యవస్థ దెబ్బతింటుందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ భారాన్ని తగ్గించడం ‘మధ్యవర్తిత్వం’తోనే సాధ్యమని తెలిపారు. ఇంట్లోని చిన్నచిన్న తగాదాలు కూడా కోర్టుకు చేరడంతో పెండింగ్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయన్నారు. ఇలాంటి కేసులన్నీ మధ్యవర్తిత్వంతోనే పరిష్కారం కావాలని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ–మీడియేషన్‌ రైటింగ్స్‌ (ఈఎండబ్ల్యూ) ఏర్పాటై మూడేళ్లయిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా గవర్నర్‌ తమిళిసై హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈఎండబ్ల్యూ మూడేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. ‘అత్తాకోడలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు.. ఇలా చిన్నచిన్న వివాదాలను ఇంటి స్థాయిలోనో లేదా గ్రామ స్థాయిలోనో ఎవరో ఒకరు మధ్యవర్తిత్వంతో పరిష్కరించే ఏర్పాట్లు జరగాలి.

పేదలకు కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందే ఆర్థిక స్తోమత తక్కువ. అలాంటి వారి సమస్యల పరిష్కారం కోసం మధ్యవర్తులు ముందుకురావాలి’అని తమిళిసై పిలుపునిచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. భరించే శక్తికి మించి న్యాయవ్యవస్థ భారం మోస్తోందని చెప్పారు.

గతంలో గ్రామీణ స్థాయిలో, కుటుంబాల్లో ఉన్న మధ్యవర్తిత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, సత్వర న్యాయం అందుతుందన్నారు. కోర్టు తీర్పు తర్వాత సదరు పార్టీల మధ్య బంధం ఉండకపోవచ్చని, అదే మధ్యవర్తిత్వ పరిష్కారంలో వారి అంగీకారంతోపాటు బంధం బలహీనపడదని చెప్పారు. మీడియేటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని, అది పెరగాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇరు పార్టీలకు సమ న్యాయం.. 
కోర్టుల్లో వివాదాల పరిష్కారంతో పోలిస్తే మధ్యవర్తిత్వ పరిష్కారం అన్నివిధాలా ఉత్తమమైనదని పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి పేర్కొన్నారు. మధ్యవర్తిత్వంలో పార్టీలు ఇద్దరూ సఫలీకృతం అవుతారని, ఇద్దరికీ సమ న్యాయం అందుతుందని చెప్పారు. ఇంట్లో, ఊరిలో, సమాజంలో మధ్యవర్తులు ఉండి ఎక్కడికక్కడే సమస్యలకు చెక్‌ పెడితే అది సమాజ పురోభివృద్ధికి దోహదం చేస్తుందని వివరించారు.

ప్రపంచమంతా అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న కోవిడ్‌ సమయంలో ఈఎండబ్ల్యూ ఊపిరిపోసుకుందని తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష కోర్టులు లేని సమయంలో కక్షిదారులకు సేవలందించిందని, ఇలా మూడేళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. మధ్యవర్తిత్వం కోసం.. మధ్యవర్తిత్వం చేత.. మీడియేటర్లే నిర్వహిస్తున్న కార్యక్రమం ఈఎండబ్ల్యూ అని మీడియేషన్‌ ట్రైనర్‌ పుష్ప్‌ గుప్తా అన్నారు.

అనంతరం మీడియేషన్‌ ట్రైనర్‌ థన్కచన్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సైనిక బలగాల ట్రిబ్యునల్‌ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ రాజేంద్ర మీనన్, పలు రాష్ట్రాల న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఈఎండబ్ల్యూ తెలంగాణ కో–ఆర్డినేటర్‌ మంజీరా వెంకటేశ్, కేఎస్‌ శర్మ, చిత్రా నారాయణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు