నేడు మంచిర్యాలకు సీఎం 

9 Jun, 2023 04:48 IST|Sakshi

గృహలక్ష్మి, బీసీ కుల వృత్తిదారులకు రూ.లక్ష సాయం.. 

రెండో విడత దళితబంధుపథకాలు ప్రారంభం 

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం, బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష సాయం, రెండో విడత దళితబంధును సీఎం కేసీఆర్‌ మంచిర్యాలలో ప్రారంభించనున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మంచిర్యాలలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి మొదట బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం, కొత్త కలెక్టరేట్‌ భవనం ప్రారంభించాక, బహిరంగ సభ వేదికపై వివిధ పథకాల లబ్దిదారు లకు లాంఛనంగా చెక్కులు అందజేస్తారు.

వీటితోపాటు రూ.1,658 కోట్ల వ్యయంతో, లక్ష ఎకరాలకు సాగునీరందించే చెన్నూరు ఎత్తిపోతల పథకం, మందమర్రిలో రూ.500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆయిల్‌పాం ఫ్యాక్టరీ, రూ.164 కోట్లతో గోదావరిపై నిర్మించనున్న మంచిర్యాల, అంతర్గాం రోడ్డు బ్రిడ్జి, రూ.205 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వైద్యకళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు.  

మరిన్ని వార్తలు