కోటి హోం ఐసోలేషన్‌ కిట్లు.. రెండు కోట్ల టెస్టింగ్‌ కిట్లు

5 Jan, 2022 04:42 IST|Sakshi

వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు రెడీ

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కోటి హోం ఐసోలేషన్‌ కిట్ల(ఎనిమిది రకాల మందుల)ను పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఎంతమందికైనా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు రెండు కోట్ల కరోనా టెస్టింగ్‌ కిట్లు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం జరిగిన సంగారెడ్డి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి హరీశ్‌రావు హాజరయ్యారు.

మంత్రి మాట్లాడుతూ ఫస్ట్‌వేవ్‌లో కరోనా కేసుల సంఖ్య తారాస్థాయికి చేరడానికి 8 నెలలు పడితే, రెండో వేవ్‌లో నాలుగు నెలలే సమయం పట్టిందని, ఈ థర్డ్‌ వేవ్‌లో రెండు నెలల్లోనే కేసులు భారీ స్థాయికి చేరుతాయని వైద్యనిఫుణులు అంచనా వేస్తున్నారని వివరించారు. అరవై ఏళ్లు దాటినవారికి బూస్టర్‌ డోసు ఇచ్చే ప్రక్రియను ఈ నెల 10 నుంచి ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌ ప్రకటించారు.

మాతాశిశు మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. దశలవారీగా సబ్‌సెంటర్లలో వైద్యులను నియమించి పల్లె దవాఖానాలుగా మార్చుతామన్నారు. బంగారు తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ ఒక భాగమని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 66 ఒమిక్రాన్‌ కేసులు నమోదుకాగా, అందులో 44మంది వ్యాక్సిన్‌ వేసుకోనివారేనని తెలిపారు. 

జగ్గారెడ్డి వచ్చారు.. వేదికపై కుర్చీ వేయండి..  
రాజకీయ ప్రత్యర్థులుగా పేరున్న మంత్రి హరీశ్‌రా వు, సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జెడ్పీ సమావేశం కొనసాగుతుండగా జగ్గారెడ్డి సమావేశం హాలులోకి రాగా.. ‘‘ఎమ్మెల్యే వచ్చారు.. వేదికపై కుర్చీ వేయండి’’అని హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని హరీశ్‌రావుకు జగ్గారెడ్డి వినతిపత్రం అందజేశారు. 

ఏఎన్‌ఎంల పట్ల మంత్రి అసహనం..  
ఉద్యోగుల కేటాయింపుల్లో తమను ఇతర జోన్‌లోకి మార్చారని, న్యాయం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ఏఎన్‌ఎంలు మంత్రి హరీశ్‌కు వినతిపత్రం అందజేయగా ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. వారి ముందే వినతిపత్రాన్ని చింపివేశారు.

మరిన్ని వార్తలు