12,676 రేషన్‌ కార్డులకు మోక్షం

11 Jun, 2021 19:39 IST|Sakshi
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని ఇందిరానగర్‌లో రేషన్‌ షాపు

 సీఎం కేసీఆర్‌ ప్రకటనతో అర్హుల్లో ఆశలు 

పూర్తయిన పరిశీలన.. మార్గదర్శకాలు రాగానే పంపిణీ

హైదరాబాద్‌: ఇప్పటి వరకు కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్‌కార్డులను ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రి వర్గంలో తీసుకున్న నిర్ణయంతో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌ నియోజక వర్గాల పరిధిలోని ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లబి్ధదారులకు కార్డులు త్వరలోనే చేతికి అందనున్నాయి. తమకంటూ ప్రత్యేకంగా ఆహార భద్రత అందించేందుకు రేషన్‌ కార్డుల రూపంలో భరోసా ఉంటుందనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేషనింగ్‌ సర్కిల్‌–7 పరిధిలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,  వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, వెంగళ్‌రావునగర్, బోరబండ, సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్లు వస్తాయి. అమీర్‌పేట, సనత్‌నగర్‌ డివిజన్లు మినహా మిగతా పది డివిజన్లు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌ నియోజక వర్గాల పరిధిలో ఉంటాయి. ఈ రెండు నియోజక వర్గాల్లో 75 రేషన్‌ షాపులు ఉండగా 85,150 మంది ఆహార భద్రతాకార్డు దారులు ఉన్నారు.  

కొత్త రేషన్‌ కార్డుల ప్రక్రియ 2 జూన్‌ 2019లో నిలిచిపోయింది. కొత్త కార్డుల జారీని ప్రభుత్వం నిలిపివేయడంతో దరఖాస్తులన్నీ ఫైళ్ళకే పరిమితం అయ్యాయి. మూడేళ్ళుగా కొత్తగా ఆహార భద్రతా కార్డుల జారీ లేకపోవడంతో మ్యుటేషన్లు నిలిచిపోయాయి. రేషనింగ్‌ సర్కిల్‌–07 పరిధిలో కొత్త రేషన్‌కార్డుల కోసం 38,306 మంది దరఖాస్తు చేసుకోగా అర్హులను గుర్తించే క్రమంలో సర్వే నిర్వహించారు. ఇందులో 12,676 కార్డులు అర్హతకు నోచుకున్నాయి.  సర్కిల్‌ పరిధిలో కొత్తగా 12,676 మంది ఆహార భద్రతా కార్డులకు అర్హులుగా తేలారు.  ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే వీరందరికీ కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ కానున్నాయి.  వార్డు, బ్లాక్‌ల వారీగా దరఖాస్తులను సిద్ధం చేసి పెట్టారు.  జీవో రాగానే పంపిణీకి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.  

మరిన్ని వార్తలు