32 జిల్లాలు.. 30 రోజులు.. 100 అంబులెన్సులు

25 Jul, 2020 03:56 IST|Sakshi

ఏర్పాటుకు ముందుకొచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు

కరోనా మహమ్మారిపై పోరు సాగించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలతో కూడిన వంద అంబులెన్సులను నెల రోజుల్లోగా సమకూర్చేందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. మంత్రి కేటీఆర్‌ శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు చేసిన ప్రతిపాదనకు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించారు. ఆరు అంబులెన్సుల కొనుగోలుకు అయ్యే ఖర్చును వ్యక్తిగతంగా భరిస్తానని కేటీఆర్‌ వెల్లడించగా మిగతావారు కూడా అదే తరహాలో ముందుకొచ్చారు. 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరు సాగించేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన వంద అంబులెన్సులను నెల రోజుల్లోగా సమకూర్చేందుకు మంత్రి కేటీఆర్‌ జన్మదినం వేదికైంది. కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితిపై కేటీఆర్‌ మాట్లాడారు. తన పుట్టినరోజు సందర్భంగా కరోనా నేపథ్యంలో 6 అంబులెన్సుల కొనుగోలుకయ్యే ఖర్చును వ్యక్తిగతంగా భరిస్తానని కేటీఆర్‌ వెల్లడించారు. కరోనా టెస్టులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వీటిని ఉపయోగించుకునేలా అందులో అన్ని సౌకర్యాలు ఉంటాయని, గ్రామీణ ప్రాంతాల్లో వీటి సేవలు అందేలా చూడాలని కోరారు. కేటీఆర్‌ ప్రతిపాదనకు స్పందిం చిన ఈటల కూడా కరీంనగర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పక్షాన 5 అంబులెన్సులు అందజేస్తానని ప్రకటించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పక్షాన 11
ఇక అంబులెన్సులు సమకూర్చాలనే ప్రతిపాదనకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ముందుకు వచ్చారు. మొత్తంగా 32 జిల్లాలకు వంద అంబులెన్సులను నెల రోజుల్లో ఇవ్వాలని నిర్ణయించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా తరఫున 6, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పక్షాన 11, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 6 చొప్పున సమకూర్చేందుకు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ ముందుకు వచ్చారు. తమ వంతుగా మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి 4, గంగుల కమలాకర్‌ 6, నిరంజన్‌రెడ్డి 3, మల్లారెడ్డి 6, సబితా ఇంద్రారెడ్డి 2 అంబులెన్సులు సమకూర్చేందుకు సిద్ధమయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు షకీల్, గణేశ్‌ గుప్తా 7, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, రంజిత్‌రెడ్డి 7 చొప్పున ఇచ్చేందుకు అంగీకరించారు.

మరిన్ని వార్తలు