తెలంగాణలో రైతు సంక్షేమం అద్భుతం 

27 Aug, 2022 01:46 IST|Sakshi
హరితహారం పథకం తీరును తెలుసుకుంటున్న ఇతర రాష్ట్రాల రైతులు.

మీడియాతో 25 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు 

సీఎం కేసీఆర్‌ దేశానికే రైతు బాంధవుడంటూ ప్రశంసలు 

తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌/ తొగుట (దుబ్బాక): వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధితోపాటు రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని ఇతర రాష్ట్రాల రైతులు కొనియాడారు. తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి, సాగునీటిరంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు 25 రాష్ట్రాల నుంచి బయలుదేరిన దాదాపు 100 మంది రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌ ఎకరానికి ఏటా రూ. 10 వేల చొప్పున రైతుబంధు సాయం, రూ. 5 లక్షల రైతు బీమా అందించడం దేశ చరిత్రలోనే గొప్ప పరిణామమని యూపీ రైతు నాయకుడు హిమాంశ్‌ ప్రశంసించారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణకే కాదు.. దేశానికే రైతు బాంధవుడని కొనియాడారు. తెలంగాణ మాదిరి పథకాలను దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అమలు చేయాల ని డిమాండ్‌ చేశారు. అనంతరం వారు తెలంగాణకు హరితహారం పథకం అమలు తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. రాజీవ్‌ రహదారి వెంట అవెన్యూ ప్లాంటేషన్, ఓఆర్‌ఆర్‌పై పచ్చదనం, సిద్దిపేట జిల్లా ములుగు, సింగాయపల్లి, కోమటిబండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల పునరుద్ధరణను పరిశీలించారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ ఆయా కార్యక్రమాల ప్రత్యేకతను వివరించారు. ఆ తర్వాత రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను సందర్శించారు. దీ న్ని అద్భుత కట్టడంగా అభివర్ణించారు. పంప్‌హౌస్‌ 8వ మోటారు నుంచి నీటి విడుదల ను తిలకించారు. అయితే ఈ క్రమంలో నీరు ఒక్కసారిగా ఎగసిపడటంతో అక్కడున్న ప్ర తినిధులంతా పరుగులు తీస్తూ ఒకరిపై ఒకరు పడిపోయారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు రైతు సంఘాల ప్రతినిధు లు గాయపడటంతో వారికి స్థానికంగా ప్రా థమిక చికిత్స చేయించి హైదరాబాద్‌కు తరలించారు.

రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాపరెడ్డి, గడా అధికారి ముత్యంరెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ హరిరామ్, మల్లన్నసాగర్‌ ఎస్‌ఈ వేణు, సాయి బాబు, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు