నోటు కొట్టి... నాటుకోండి

11 Jan, 2021 05:17 IST|Sakshi

సచివాలయంలో సిద్ధంగా 100 చెట్లు  

ట్రాన్స్‌లొకేషన్‌కు ఇచ్చేందుకు రెడీ అంటున్న యంత్రాంగం 

నమ్మకం కలిగిస్తే ఉచితం.. అండర్‌టేకింగ్‌ ఇవ్వాలి 

సాక్షి, హైదరాబాద్‌: మీకు చెట్టు నాటేంత ఖాళీ స్థలం ఉందా.. అయితే ఏకంగా దశాబ్దాల వయసున్న చెట్టు అక్కడ ప్రత్యక్షం అయ్యేందుకు సిద్ధం. మొక్క తెచ్చి పెంచాలంటే ఎన్నో ఏళ్ల సమయం పడుతుంది. అదే ఏళ్ల వయసున్న చెట్టును నాటుకుంటే.. వింటుంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఒకటి, రెండు కాదు దాదాపు వంద చెట్లను ఇలా ట్రాన్స్‌లొకేషన్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వేరేచోటికి తరలించి బతికించాల్సిన చెట్లకు ‘ధర’కట్టాలనడమే విడ్డూరంగా ఉంది. 

ఆసక్తి ఉంటే తీసుకెళ్లండి..
కొత్త సచివాలయం నిర్మిస్తున్న ప్రాంగణంలో వందల సంఖ్యలో చెట్లు ఉన్నాయి. నిర్మాణానికి అడ్డుగా వేప, రావి, మర్రి, పొగడ, మరికొన్ని వృక్షాలు ఉన్నాయి. వాటిని కొట్టేయటం కంటే ట్రాన్స్‌ లొకేషన్‌ ద్వారా వేరే చోట నాటించి పెం చాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 40 చెట్లను తరలించారు.  మరో వంద చెట్లను ఆసక్తి ఉన్నవారు ట్రాన్స్‌లొకేషన్‌ చేయడానికి తీసుకెళ్లవచ్చంటూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. మరో 250 వరకు కొట్టేసేందుకు మార్క్‌ చేసినట్టు తెలిసింది. సంరక్షించాల్సిన చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు అవకాశం కల్పిస్తున్నారు. 

ధర చెల్లించాల్సిందే.. 
ట్రాన్స్‌లొకేషన్‌కు నిర్ధారించిన చెట్లే కాకుండా ఇతర చెట్లను సంరక్షి స్తామని  తీసుకెళ్లి అమ్మేసుకుంటారన్న అనుమానాలను కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని నివారించేందుకే వాటికి ధర నిర్ధారించామని చెబుతున్నారు. చెట్టు ఆకృతిని బట్టి ధరలున్నాయి. దీనివల్ల నిజంగా పెంచుకోవాలనుకునే వారే ట్రాన్స్‌లొకేషన్‌కు ముందుకొస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రకృతి ప్రేమి కులకు మాత్రం ట్రాన్స్‌లోకేషన్‌ చెట్లకు ధరను నిర్ణయించడం రుచించడం లేదు. పెంచుకుంటామని అండర్‌టేకింగ్‌ ఇస్తే ఉచితంగానే ఇస్తామంటున్నారు.  

ఓ సంస్థ ఆరోపణలతో వివాదం 
తొలుత ఓ సంస్థ చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు ముందుకొచ్చింది. 18 చెట్లను తీసుకెళ్లి శంషాబాద్‌ పరిసరాల్లో నాటింది. కొట్టేసేందుకు ఖరారు చేసిన చెట్లను కూడా ట్రాన్స్‌లొకేట్‌ చేసేందుకు ఆసక్తి చూపింది. ఇక్కడే వివాదం మొదలైంది. ఒక్కో చెట్టుకు రూ.8 వేల చొప్పున చెల్లించాలని అధికారులు అడిగారని, చెట్లను సంరక్షించేందుకు ముందుకొస్తే ధర అడగటమేమిటని ప్రశ్నిస్తే... అధికారులు దురుసుగా ప్రవర్తించారని, దీంతో ట్రాన్స్‌లొకేషన్‌ ప్రక్రియ నుంచి తప్పుకున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. దీంతో ఈ ప్రక్రియపై విమర్శలు వచ్చాయి. ఆ సంస్థను కాదని అధికారులు ఇతరులను ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చారు. ఆ మేరకు మరో రెండు సంస్థలు 40 చెట్లను ట్రాన్స్‌లొకేట్‌ చేశాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే తాము రూ.8 వేల చొప్పున కోరలేదని, చెట్లను తీసుకెళ్లి పెంచకపోతే తాము విమర్శల పాలు కావాల్సి వస్తుందని, అందుకే కొంత రుసుము ఖరారు చేశామని చెప్పారు.  

>
మరిన్ని వార్తలు