రాష్ట్రంలో కరోనా కేసులు 1,04,249 

24 Aug, 2020 05:16 IST|Sakshi

ఇప్పటివరకు 9.31 లక్షల పరీక్షలు

గత రెండ్రోజులుగా రోజుకు 40 వేలకుపైనే టెస్టులు

తాజాగా 2,384 కేసులు.. మరో 11 మంది మృతి

మొత్తం కోలుకున్నవారు 80,586.. మరణాలు 755

గంటకు 25 మందికి వైరస్‌.. కోలుకునేవారు 19 మంది

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. రోజురోజుకు వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఎక్కడ చూసినా కోవిడ్‌ కేసులే కనిపిస్తున్నాయి. దీంతో జనంలో ఆందోళన పెరుగుతోంది. ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోతున్నాయి. అనుమానిత లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య ఎక్కువైంది. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 9,31,839 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,04,249 మందికి వైరస్‌ సోకినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి 80,586 మంది కోలుకోగా.. 22,908 మంది చికిత్స తీసుకుంటున్నారు. అందులో ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో 16,379 మంది ఉన్నారు. వ్యాధి బారినపడి ఇప్పటివరకు 755 మంది ప్రాణాలు కోల్పోయారు. 

40 వేలకు పైగా టెస్టులు..
రెండ్రోజులుగా రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు దాదాపు రెట్టింపయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారం రోజుల క్రితం ప్రతీరోజు 40 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం పరీక్షల సామర్థ్యాన్ని వైద్య, ఆరోగ్య శాఖ పెంచింది. ఎక్కడికక్కడ యాంటిజెన్‌ టెస్టులు జరుగుతున్నాయి. ఇక ఈ నెల 21న 43,095 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,474 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఏడుగురు చనిపోయారు. 1,768 మంది కోలుకున్నారు. ఇక తాజా బులెటిన్‌ ప్రకారం 22వ తేదీన 40,666 మందికి టెస్టులు నిర్వహించగా, 2,384 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. 11 మంది చనిపోయారు. కొత్తగా 1,851 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రతీ 10 లక్షల జనాభాకు 25,099 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 472, నిజామాబాద్‌ జిల్లాలో 148, నల్లగొండలో 137, రంగారెడ్డిలో 131, కరీంనగర్‌లో 120, జగిత్యాల, ఖమ్మంలలో 105, సూర్యాపేట జిల్లాలో 110 కేసులు నమోదయ్యాయి.

ప్రైవేట్‌లో 4,938 బెడ్లు ఖాళీ..
తెలంగాణలో ప్రస్తుతం 170 ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కరోనా వైద్య చికిత్సలు జరుగుతున్నాయి. అందులో మొత్తం పడకలు 9,057 ఉండగా, 4,119 పడకలు కరోనా రోగులతో నిండిపోయాయి. ఇంకా 4,938 పడకలు ఖాళీగా ఉన్నాయి. అందులో సాధారణ పడకలు 1,789, ఆక్సిజన్‌ పడకలు 2,122, ఐసీయూ పడకలు 1,027 ఉన్నాయి. ఇటు 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 7,952 కరోనా పడకలుండగా, వాటిల్లో 2,410 రోగులతో నిండిపోయాయి. ఇంకా 5,542 పడకలు ఖాళీగా ఉన్నాయి. 

గంటకు 25 కేసులు.. 
మార్చి 2న రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. అప్పటినుంచి ఈ నెల 22 నాటికి అంటే 170 రోజుల్లో కరోనా కేసులు లక్ష దాటాయి. ఆ ప్రకారం ప్రతీ గంటకు రాష్ట్రంలో సరాసరి 228 పరీక్షలు జరగ్గా.. 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక గంటకు కోలుకున్నవారు 19 మంది ఉండటం గమనార్హం. అలాగే ప్రతీరోజు సరాసరిన నలుగురు మరణించారు. 

>
మరిన్ని వార్తలు