టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు రాస్తున్నారా? సక్సెస్‌బాట పట్టించే సూచనలు తెలుసుకోండి

18 May, 2022 14:53 IST|Sakshi

పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు ఓ వైపు ఒత్తిడి, మరోవైపు వారిలో ఆందోళనను నివృత్తి చేసేందుకు వారికి ఉపాధ్యాయులు, అధికారులు పలు సూచనలు చేశారు.

మైలార్‌దేవ్‌పల్లి (హైదరాబాద్‌): ఏకాగ్రత, ప్రణాళిక బద్ధంగా చదివితేనే విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు.
పలు సూచనలు.. 

► పరీక్షా సమయంలో సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్ల వైపు దృష్టి మరలకుండా చూసుకోవాలి. ప్రతి రోజు విద్యార్థి నిర్ధేశించుకున్న టైమ్‌ టేబుల్‌ ప్రకారం చదువుకోవాల్సి ఉంటుంది. 
► ఉపాధ్యాయులు, స్నేహితులు, సీనియర్ల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు సిద్ధమైతేనే విజయం మరింత సులభమవుతుంది. 
► ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ముఖ్యంగా విద్యార్థులకు  పరీక్ష సమాయాల్లో ఇంట్లో చక్కటి వాతావరణం కల్పించాలి. 
► విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయడంతో పాటు అవసరమైన ధైర్యాన్ని అందించాలి.
► ఒత్తిడిని తగ్గించేందుకు వారికి సహకారం అందిస్తే అధిక సమయం చదువుకే కేటాయిస్తారు. 
► తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా విద్యార్థికి తగిన ఆహారం అందించాలి.
► విద్యార్థులు సమయానికి తగినట్లుగా నిద్రపోయేలా కుటుంబసభ్యులు చూసుకోవాలి. 

రెండు ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాం 
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు పూర్తి సన్నద్ధం చేశాం. ఇప్పటికే రెండు ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించి వారికి మనోధైర్యాన్ని కల్పించాం. గణితం, సైన్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులలో మంచి మార్కులు వచ్చేలా ఎప్పటికప్పుడు తరగతులు నిర్వహిస్తున్నాం. మే 23 నుంచి జూన్‌ 1 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నాం.    
 –రామిరెడ్డి, ఎంఈఓ రాజేంద్రనగర్‌ 

సొంతంగా రాసిన జవాబులకే అధిక మార్కులు 
ఉపాధ్యాయులు ఇచ్చిన మెటీరియల్‌ను విద్యార్థులు చదువుకుని పాఠ్య పుస్తకాలపైనే దృష్టిసారించాలి. సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలకు సిద్ధం కావాలి. సొంతంగా రా సిన జవాబులకే అధిక మార్కులు వేసే అవకాశం ఉంటుంది.      
–ఎన్‌.మాణిక్యంరెడ్డి, ఉపాధ్యాయుడు

ఖాళీ కడుపుతో వెళ్లకూడదు 
విద్యార్థులు పరీక్షలకు వెళ్లే సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. పరీక్షలకు వెళ్లే ముందు తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలి. ప్రశ్నా పత్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే జవాబులు రాయాలి.  
–డాక్టర్‌ సుభాష్, మైలార్‌దేవ్‌పల్లి 

10 జీపీ సాధిస్తామనే నమ్మకం ఉంది 
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేదు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వింటూ ఉపాధ్యాయులు ఇచ్చిన నోట్స్‌ను ఇప్పటికే చదివేశాం. పదికి పది జీపీ సాధిస్తామన్న విశ్వాసం ఉంది.  
–స్వాతి, పదో తరగతి విద్యార్థిని

మరిన్ని వార్తలు