పొద్దెక్కినా పావని నిద్ర లేవలేదు.. శరీరం పచ్చగా మారడంతో

16 Sep, 2022 17:47 IST|Sakshi
పావని (ఫైల్‌)   

సాక్షి, నల్గొండ: విష పురుగు కుట్టి చిన్నారి మృతిచెందిన ఘటన మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్లపాడుతండా సమీపంలో గల జగ్గుతండాలో చోటుచేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం... జగ్గుతండాకు చెందిన భూక్య హరి, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె పావని(11)సంతానం. పావని తండాలోని పాఠశాలలోనే 4వ తరగతి చదువుతుంది.  బుధవారం రాత్రి తల్లి సుజాతతో కలిసి పావని ఇంట్లో నేలపై నిద్రించింది. గురువారం తెల్లవారుజామున సుజాత నిద్ర లేచి రోజుమాదిరిగానే ఇంట్లో పనులు చేసుకుంటుంది.

కాగా పొద్దెక్కినా కూడా పావని నిద్ర లేవకపోవడంతో పాటు ఎంత పిలిచినా పలకకపోవడంతో దగ్గరికి వెళ్లి చూసింది. పావనిలో ఎటువంటి చలనం లేకపోవడంతో వెంటనే భర్త హరికి విషయం చెప్పింది. అతడు వచ్చి చూడగా పావని శరీరం చల్లబడటంతో పాటు నాడీ స్పందన లేకపోవడంతో తమ కుమార్తె చనిపోయిందని నిర్ధారించుకున్నారు. కాగా పావని శరీరం పచ్చగా మారడంతో ఏదైనా విష పురుగు కుట్టి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. కుమార్తె మృతిని తట్టుకోలేక సుజాత స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే స్థానిక వైద్యుడిని పిలిపించి ఆమెకు సెలైన్‌ బాటిల్‌ ఎక్కించారు.

మరిన్ని వార్తలు