అయ్యో.. హారిక..! కన్న తండ్రి భుజాలపై మోసుకెళ్లి వాగు దాటినా..

5 Sep, 2021 03:06 IST|Sakshi
ఉధృతంగా ప్రవహిస్తున్న బొంకూరు వాగు. హారిక(ఫైల్‌) 

జ్వరంతో బాలిక మృతి 

ఊరు చుట్టూ వాగు ఉండటంతో ఆస్పత్రికి వెళ్లలేని దుస్థితి  

వైద్యం ఆలస్యం కావడంతో మృతి

తాండూరు మండలం బొంకూరులో విషాదం

తాండూరు రూరల్‌ (వికారాబాద్‌): పదకొండేళ్ల బాలికకు నూరేళ్లు నిండాయి. జ్వరంతో ఆరోగ్యం విషమించడం.. ఊరు చుట్టూ వాగు ఉండి ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యం కావడంతో బాలిక మృతిచెందింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం బొంకూరుకు చెందిన హరిజన్‌ బాలప్ప, అమృతమ్మల కుమార్తె హారిక (11)  ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఇటీవల స్కూల్‌కు వెళ్లి పుస్తకాలు తెచ్చుకుం ది. పాఠశాలలు తెరుచుకోవడంతో స్నేహితులతో కలిసి వెళ్లాలనుకుంది. అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో బొంకూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు బయటకు వెళ్లలేని పరిస్థితి.
(చదవండి: బంజారాహిల్స్‌: ఓయో రూమ్స్‌లో అవసరమైన వారికి..)

రెండు రోజుల క్రితం జ్వరం.. 
హారికకు 2రోజుల క్రితం తీవ్రజ్వరం వచ్చింది. వాగు ఉధృతి కారణంగా ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి. శుక్రవారం సాయంత్రం జ్వరం తీవ్రం కావడంతో హారికను భుజాలపై ఎత్తుకుని బొంకూర్‌ నుంచి పొలాల వెంట ఖాంజాపూర్‌ వెళ్లారు. అక్కడి నుంచి తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం బాలిక కన్నుమూసింది.

బొంకూర్‌ నుంచి తాండూరుకు వెళ్లాలంటే బొంకూర్‌ వాగుపై వంతెన నిర్మించాలి. తమ సమస్యను అరవై ఏళ్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మించి ఉంటే హారికను జ్వరం వచ్చిన రోజే ఆస్పత్రికి తీసుకెళ్లేవారమని తల్లిదండ్రులు రోధిస్తూ పేర్కొన్నారు.
(చదవండి: ‘బతికున్న రోగి చనిపోయాడని చెప్పిన సిబ్బంది’)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు