బొగ్గు గని కార్మికుల వేజ్‌బోర్డు ఐదేళ్లు

17 Feb, 2022 05:46 IST|Sakshi
ఢిల్లీలో జరిగిన సమావేశంలో బొగ్గుగని సంస్థల యాజమాన్యాలు, కార్మిక సంఘాల నేతలు 

శ్రీరాంపూర్‌ (మంచిర్యాల)/గోదావరిఖని: సింగరేణి సహా దేశంలోని అన్ని బొగ్గు గనుల 11వ వేజ్‌ బోర్డు కాలపరిమితి ఐదేళ్లు ఉండేలా ఒప్పందం జరిగింది. బుధవారం ఢిల్లీలోని సామ్రాట్‌ హోటల్‌లో కోలిండియా చైర్మన్‌ అగర్వాల్‌ అధ్యక్షతన జరిగిన 11వ జేబీసీసీఐ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భేటీలో భాగంగా వేతన ఒప్పందంపై కోలిండియా, సింగరేణి కంపెనీ, 4 జాతీయ సంఘాల ప్రతినిధులు చర్చించారు. నవరత్న, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో వేతన ఒప్పంద కాలపరిమితి 10 ఏళ్లుగా ఉందని, బొగ్గు పరిశ్రమల్లోనూ ఇలానే ఒప్పందాలు చేసుకోవాలని కోలిండియా యాజమాన్యం పట్టుబట్టింది.

సంస్థలో పనిచేస్తున్న అధికారులతో పోల్చితే కార్మికుల బేసిక్‌ ఎక్కువగా ఉంటోందని పేర్కొంది. అయితే ఈ ఒప్పందానికి జాతీయ సంఘాలు ససేమిరా అన్నాయి. ఐదేళ్ల కాలపరిమితికే అంగీకరిస్తామని చెప్పాయి. దీంతో యాజమాన్యం వెనక్కి తగ్గి అంగీకరిస్తూ ఒప్పందం చేసుకుంది. మిగతా జీతభత్యాల విషయం ఈ చర్చల్లో కొలిక్కి రాలేదు. 

డీపీఈ ప్రకారం వేతనాలు మాకొద్దు
కార్మిక సంఘాల డిమాండ్లను పరిష్కరిస్తే ఎంత ఆర్థిక భారం పడుతుందో యాజమాన్యం లెక్కలేసి చెప్పింది. పీఎస్‌యూల్లో ఉన్న వేతనాలకు అనుగు ణంగా బొగ్గు పరిశ్రమల్లోనూ వేతనాలు ఉండాలని సూచించింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ (డీపీఈ) గైడ్‌లైన్స్‌ మార్గదర్శకాల ప్రకారం వేతనాలు పెంచుతామంది. కానీ కార్మిక సంఘాల నేతలు డీపీఈ గైడ్‌లైన్స్‌ ప్రకారం వేతనాలు అంగీకరించబోమన్నారు.

వేతనాలు, అలవెన్సు పెరుగుదల, కేడర్‌ స్కీం, సీపీఆర్‌ఎంఎస్‌ మెడికల్‌ స్కీం సవరణ, పెన్షన్‌ సవరణ, డిపెండెంట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ వంటి డిమాండ్లను 5 విభాగాలుగా చేసి ప్రత్యేక కమిటీల ద్వారా చర్చిస్తామని యాజమాన్యం ప్రతిపాదించగా కార్మిక సంఘాల నేతలు ఖండించారు. అన్నింటినీ తదుపరి సమావేశాల్లోనే చర్చించాలని డిమాండ్‌ చేశారు. మిగతా డిమాండ్లపై ఏప్రిల్‌లో జరిగే సమావేశంలో చర్చిస్తామని వేజ్‌బోర్డు సభ్యుడు వి.సీతారామయ్య తెలిపారు. సమావేశంలో లక్ష్మారెడ్డి, మాధవ్‌నాయక (బీఎంఎస్‌), రియాజ్‌ అహ్మద్‌ (హెచ్‌ఎమ్మెస్‌), మంద నర్సింహారావు (సీఐటీయూ) పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు