Pranahita River Pushkaralu 2022: ప్రాణహిత పుష్కర సంబరం

13 Apr, 2022 03:05 IST|Sakshi
కాళేశ్వరం దేవస్థానం

నేటి నుంచి 12 రోజులపాటు...

కాళేశ్వరం, తుమ్మిడిహెట్టి, అర్జునగుట్ట, వేమనపల్లి వద్ద పుష్కరఘాట్లు  

ముక్తేశ్వర దర్శనానికి పోటెత్తనున్న భక్తులు 

తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి జనం 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/సాక్షి, మంచిర్యాల: ప్రాణహిత పుష్కరాలకు నదీతీరం, త్రివేణి సంగమం సంసిద్ధమైంది. నదులకు 12 ఏళ్లకోసారి నిర్వహించే పుష్కరాల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల గుండా ప్రవహించే ప్రాణహిత నదికి బుధవారం నుంచి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని (సరస్వతి) నదులు కలిసే త్రివేణి సంగమ స్థానం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తనున్నారు.

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో నిర్వహించే ఈ పుష్కరాలకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఘాట్లను ఏర్పాటు చేశాయి. ఈనెల 24 వరకు జరిగే ఈ పుష్కరాలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రం, మహారాష్ట్ర వైపు సిరోంచ, నగు రంలో ఈ ఘాట్లు ఉన్నాయి. బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అర్జునగుట్ట వద్ద పుష్కరాలను ప్రారంభించనున్నారు. అన్ని పుష్కరఘాట్ల వద్ద విధుల నిర్వహణ కోసం సుమారు ఆరువేల మంది పోలీసులు, ఇతర శా ఖల సిబ్బంది పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 

ప్రాణహిత జననం, పయనం: గోదావరి నదికి అతి పెద్ద ఉపనది ప్రాణహిత. పెన్‌గంగా, వార్దా నదిలో తెలంగాణలోని ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత పురుడు పోసుకుంది. ఈ నది తుమ్మిడిహెట్టి నుంచి 113 కి.మీ. ప్రవహిస్తుంది. బెజ్జూర్‌ మండలం గూడెం, సోమిని, తలాయి, వేమనపల్లి మండలం రావులపల్లి, వేమనపల్లి, కలలపేట, ముల్కల్లపేట, రాచర్ల, వెంచపల్లి, కోటపల్లి మండలం జనగామ, నందరాంపల్లి, పుల్లగామ, సిర్సా, అన్నారం, అర్జునగుట్ట గ్రామాల మీదుగా పయనిస్తుంది.

మహారాష్ట్ర వైపు గడ్చిరోలి జిల్లాలోని చప్రాల నుంచి ప్రారంభమై అయిరి, ఇందారం, తోగుల వెంకటాపూర్‌ మీదుగా ప్రవహిస్తూ రేగుంట, కొత్తూర్, తేకడా, గిలాస్పేట, రాయిపేట, రంగాయపల్లి, హమురాజీ, సిరోంచ మీదుగా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం (కాళేశ్వర ముక్తేశ్వరులుగా వెలిసిన పరమేశ్వరుడి పుణ్యక్షేత్రం) వద్ద గోదావరి నదిలో కలుస్తుంది.  

పుష్కర ఘాట్లు ఇవే.. 
కాళేశ్వరం త్రివేణి సంగమం – జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 
తుమ్మిడిహెట్టి– కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం  
అర్జునగుట్ట–మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం 
వేమనపల్లి – మంచిర్యాల జిల్లా మండల కేంద్రం 
సిరోంచ, నగురం – మహారాష్ట్ర 

ఇలా చేరుకోవచ్చు.. 
కాళేశ్వరం: హైదరాబాద్‌ నుంచి కాజీపేట, వరంగల్‌ వరకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నా యి. వరంగల్‌ నుంచి రోడ్డుమార్గన భూపా లపల్లి మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు. 

అర్జునగుట్ట: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి మంచిర్యాల వరకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి చెన్నూరు మీదుగా అర్జునగుట్ట ఘాట్‌కు చేరుకోవచ్చు. 

తుమ్మిడిహెట్టి: కుమురంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి ఘాట్‌కు వెళ్లాలంటే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి మంచిర్యాల మీదుగా రైళ్లు కాగజ్‌నగర్‌ వరకు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సిర్పూర్‌ టీ మీదుగా తుమ్మిడిహెట్టికి చేరుకోవచ్చు. 

వేమనపల్లి: నిజామాబాద్, కామారెడ్డి, జిల్లాల నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల చేరుకుని అక్కడి నుంచి వేమనçపల్లికి వెళ్లవచ్చు. 

మరిన్ని వార్తలు