తెలంగాణకు 12 ‘స్వచ్ఛ’ అవార్డులు

14 Nov, 2021 03:59 IST|Sakshi

ఇది మా కృషి ఫలితం: మంత్రి కె. తారక రామారావు

కొత్త మున్సిపల్‌ చట్టంతో పట్టణాల రూపురేఖలు మార్చాం

పురపాలికల సంఖ్యను    72 నుంచి 142కు పెంచుకున్నాం

 పారిశుధ్యం, మౌలికవసతుల్లో మన టౌన్లకు దేశంలోనే తొలిస్థానం

సాక్షి, హైదరాబాద్‌: పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రంలోని పట్టణాలు దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నాయని మున్సిపల్‌ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. దార్శనికత గల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా మున్సిపల్‌ చట్టంలో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ దేశవ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణ, సవాళ్లపై నిర్వహించిన పోటీలో తెలంగాణ రాష్ట్రం సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్‌ అవార్డుతోపాటు వివిధ కేటగిరీల్లో 12 అవార్డులను గెలుచుకుందన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ సీడీఎంఏ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డులు అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సంఖ్యను 72 నుంచి 142కి పెంచుకున్నట్లు తెలిపారు. 

పట్టణాలకు రూ. 2,959 కోట్లు ఇచ్చాం... 
2019లో నూతన మున్సిపల్‌ చట్టాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్‌ పట్టణాల రూపురేఖలు మార్చేందుకు పట్టణ ప్రగతిని తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మౌలికవసతుల కోసం రూ. 2,959 కోట్లు విడుదల చేశామన్నారు. ఎక్కడా లేని విధంగా గ్రీన్‌ బడ్జెట్‌ ద్వారా హరిత పట్టణాలను రూపొందించే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. 142 పురపాలక సంస్థలు, కార్పొరేషన్లలో ఓడీఎఫ్‌ ప్లస్‌ కింద 101, ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్లస్‌ కింద 8 మున్సిపాలిటీలు ఎంపికయ్యాయన్నారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం దేశంలోనే విజయవంతంగా అమలైన నగరం హైదరాబాదేనన్నారు.

వీధి వ్యాపారు లకు రూ. 10 వేల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీలకు నిధుల కొరత లేదని, చిన్న మున్సిపాలిటీలకు ప్రభుత్వం నుంచే నిధులు అందజేస్తున్నట్లు కేటీఆర్‌ వివరించారు. గతంలో పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలలకోసారి జీతాలు ఇచ్చేవారని, ప్రస్తుతం నెలనెలా వేతనాలను అంది స్తూ కార్మికులకు అండగా నిలుస్తున్నామన్నారు. అవార్డులను గెలుచుకున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. 

వారు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారా? 
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌తో పాటు గోల్కొండ, లంగర్‌హౌజ్‌ వంటి ప్రాంతాల్లో రక్షణ శాఖకు చెందిన అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌ ప్రాంతంలో స్కైవేల నిర్మాణం, రోడ్ల వెడల్పు పనుల గురించి సీఎం స్వయంగా రక్షణ శాఖకు లేఖలు రాసినా పట్టించుకోవట్లేదని, రక్షణ శాఖ పరిధిలోని భూములు రాష్ట్రంలో లేనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కం టోన్మెంట్, లంగర్‌హౌస్‌లలో సమాంతర పాలన సాగిస్తున్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో భాగంగా ఉన్నా మని మరిచిపోయారని విమర్శించారు. ఈ విషయంలో తగిన విధంగా స్పందించకుంటే పోరాటమే దిక్కన్నారు. హైదరాబాద్‌కు సం బంధించి తాము చేసిన విజ్ఞప్తులను కేంద్రం బుట్టదాఖలు చేసిందని విమర్శించారు.  

మరిన్ని వార్తలు