‘ఆ ప్రాంతంలో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు’

20 Sep, 2020 16:00 IST|Sakshi

అధికారుల నిర్లక్ష్యం మూలంగానే మా బిడ్డ మృతి

ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా చర్యలు తీసుకోండి

మీడియాతో సుమేధ తల్లిదండ్రుల ఆవేదన

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు కడుపుకోత మిగిలిందని సుమేధ కపూరియా తల్లిదండ్రులు సుకన్య, అభిజిత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దని
అన్నారు. ఆదివారం వారు ‘సాక్షి’తో మాట్లాడారు. ‘మా కూతురు ప్రాణాలు కోల్పోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. సుమేధ మృతిపై మానవ హక్కుల సంఘం స్పందించినందుకు ధన్యవాదాలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాలా మూసివేయాలి. మా ‌కూతురు‌ మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్న వారు ఆలోచించుకోవాలి. తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారు. నాలా కారణంగానే మా బిడ్డ మరణించడం అధికారుల వైఫల్యం కాదా?

అభివృద్ధి చేయలేనప్పడు ట్యాక్సులు ఎందుకు వసూలు చేస్తున్నారు. మా కూతురు ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు. కాలనీలో ఒక్క‌ సీసీ కెమెరా లేదు. ఘటన‌ జరిన‌ ప్రాంతంలో చుట్టుపక్కల ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేయకపోవడం బాధ్యతారాహిత్యం కాదా?’అని సుమేధ తల్లిదండ్రులు ప్రశ్నించారు. కాగా, నేరెడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కాకతీయ నగర్‌లో నివాసముండే  12 ఏళ్ల సుమేధ సైకిల్‌ తొక్కుకుంటూ బయటికెళ్లి ప్రమాదవశాత్తూ ఓపెన్‌ నాలాలో పడిపోడంతో ప్రాణాలు విడిచింది.  ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వరద ఉధృతికి సుమేధ మృతదేహం స్థానికంగా ఉండే బండ చెరువుకు కొట్టుకెళ్లింది. 
(చదవండి: ఉసురు తీసిన నాలా )

మరిన్ని వార్తలు