స్వచ్ఛ తెలంగాణ 

23 Sep, 2022 00:49 IST|Sakshi

సర్వ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌లో దేశంలోనే నంబర్‌ వన్‌ 

పలు కేటగిరీల్లోనూ టాప్‌ త్రీలో నిలిచిన రాష్ట్రం 

మొత్తం 13 స్వచ్ఛ అవార్డులు కైవసం 

అక్టోబర్‌ 2న ప్రదానం చేయనున్న రాష్ట్రపతి 

సాక్షి, హైదరాబాద్‌:   స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో తెలంగాణ దూసుకుపోతోంది. సర్వ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ (ఎస్‌ఎస్‌జీ)లో జాతీయ స్థాయిలో (పెద్ద రాష్ట్రాల విభాగం) నంబర్‌ వన్‌గా నిలిచింది. ఎస్‌ఎస్‌జీకి సంబంధించిన పలు కేటగిరీల్లో టాప్‌–3 ర్యాంకుల్లో నిలిచింది. మొత్తం 13 స్వచ్ఛ అవార్డులు సాధించి సత్తా చాటింది. అక్టోబర్‌ 2న స్వచ్ఛ భారత్‌ దివస్‌ సందర్భంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులు అందజేస్తారు.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ డైరెక్టర్‌ వికాస్‌ శీల్‌ రాష్ట్రానికి లేఖ రాశారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తోందని ప్రశంసించారు. కాగా సీఎం కేసీఆర్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ల సహకారంతోనే ఈ ప్రగతి సాధ్యమైందంటూ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ధన్యవాదాలు తెలిపారు.

అవార్డులు, రికార్డులతో పాటు రాష్ట్రానికి కేంద్రం నిధులు కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గతంలోనూ స్వచ్ఛ, పారిశుధ్య, ఇ– పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీలు, ఉత్తమ ఆడిటింగ్‌ వంటి అంశాలతో పాటు 100 శాతం నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న రాష్ట్రంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఏటా నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛత, పరిశుభ్రతపై సర్వే (ఎస్‌ఎస్‌జీ) నిర్వహించి ఆ మేరకు కేంద్రం అవార్డులు అందజేస్తోంది. 

మరిన్ని వార్తలు