1.34 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం  

1 Mar, 2021 04:03 IST|Sakshi

మరో 50 వేల పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నాం

ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, చేవెళ్ల: తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 50 వేల పోస్టుల భర్తీకి సర్కారు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆదివారం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపు కోసం ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి హరీశ్‌ హాజరయ్యారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ, సర్కారు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఒక అబద్ధాన్ని పదేపదే చెబుతూ అది నిజం అవుతుందని భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అడిగిన ప్రశ్నకు తానే స్వయంగా సమాధానం చెప్పినట్లు మంత్రి స్పష్టం చేశారు.

కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పట్టభద్రులు బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో కోత విధిస్తూ, పెట్రో ధరలు పెంచుతూ ప్రజలను బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ బిడ్డగా పీవీ నరసింహారావు ఢిల్లీని శాసించి తెలుగువాడి ఖ్యాతిని ఇనుమడింపజేశారని తెలిపారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు మంజూరైతే కేంద్రం రద్దు చేసిందని ఆరోపించారు. సమావేశంలో రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, మాజీ ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డి, గట్టు రాంచందర్‌రావు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు