ఒక పోలింగ్‌ కేంద్రంలో 1400 మంది ఓటర్లే ఎందుకో తెలుసా?

18 Oct, 2021 15:54 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఎన్నికల సందర్భంగా ఏదైనా పోలింగ్‌ కేంద్రంలో గరిష్టంగా 1400 మంది ఓటర్లను మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఈవీఎంకు అనుసంధానించి ఉండే వీవీ ప్యాట్లోని థర్మల్‌ కాగితం 1500ల కాగితపు స్లిప్పులను మాత్రమే ముద్రించగలుగుతుంది. 22.5 వోల్టు బ్యాటరీతో పని చేసే వీవీప్యాట్లలో ఓటరు ఎవరికి ఓటు వేసింది. తెలిపేందుకు వీవీ ప్యాట్లోని డిస్‌ప్లేలో ఓటరు స్లిప్‌ కనిపిస్తుంది. అయితే ఇందులో 100వరకు కాగితపు స్లిప్పులు పోలింగ్‌ రోజున జరిగే మాక్‌ పోలింగ్‌ ప్రక్రియలోనే ఖర్చవుతాయి. అందుకే ప్రతీ పోలింగ్‌ స్టేషన్లో గరిష్టంగా 1400 మందికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి అన్న మాట.
చదవండి: ఈటల రాజేందర్‌ను చిత్తు చిత్తుగా ఓడించండి: హరీశ్‌

వీళ్లు అభ్యర్థులే కానీ ఓట్లేసుకోలేరు
ఎన్నికల బరిలో నిలిచారు.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు..తమకే ఓటేయాలని ఊరూరా తిరుగుతున్నారు కానీ ఎన్నికల రోజున మాత్రం ఓటు వేయలేరు. వారి ఓటు వారే వేసుకోలేని పరిస్థితి అన్న మాట. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఇతర నియోజకవర్గాల అభ్యర్థులు బరిలో దిగారు. వీరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ ఉమ్మడి జిల్లా అయినప్పటికీ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఓటు లేదు. హైదరాబాద్‌లో ఉంది. ఇక రిజిస్టర్డు పార్టీల్లో అలీ మన్సూర్‌ మహ్మద్‌ (అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌) నిజామాబాద్‌ జిల్లావాసి. కన్నం సురేశ్‌కుమార్‌(జె స్వరాజ్‌ పార్టీ)ది మేడ్చల్‌ జిల్లా. కర్ర రాజిరెడ్డి (ఎంసీపీఐ(యు) శాయంపేట వాసి. లింగిడి వెంకటేశ్వర్లు (ప్రజావాణి పార్టీ)ది సూర్యపేట జిల్లా.
చదవండి: మీకు తెలుసా.. ఓట్లు ఎన్నిరకాలుగా వేయవచ్చో..?

స్వతంత్ర అభ్యర్థుల్లో ఉప్పు రవీందర్, ఉరుమల్ల విశ్వం, కోట శ్యామ్‌కుమార్‌ది కరీంనగర్‌. ఎడ్ల జోగిరెడ్డి తిమ్మాపూర్‌ మండలం కాగా కుమ్మరి ప్రవీణ్‌ది కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌. గుగులోతు తిరుపతిది సైదాపూర్‌. గంజి యుగంధర్‌ది పర్వతగిరి. బుట్టెంగారి మాధవరెడ్డి, సీపీ సుబ్బారెడ్డి, చెలిక చంద్రశేఖర్, కంటే సాయన్నది మేడ్చల్‌. చిలుక ఆనంద్‌ జూలపల్లి. పిడిశెట్టి రాజుది కోహెడ. లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డిది శంకరపట్నం మండలం కాచారం. వేముల విక్రమ్‌రెడ్డిది ధర్మపురి మండలం జైనలో ఓటు హక్కు ఉంది. మొత్తంగా 30 మంది అభ్యర్థుల్లో 20 మంది వారి ఓటు వారికే వేసుకోలేరు.

మరిన్ని వార్తలు