రాష్ట్రంలో కొత్తగా 159 బార్లు

26 Jan, 2021 11:14 IST|Sakshi

మున్సిపాల్టీల పరిధిలో ఏర్పాటుకు ఎక్సైజ్‌ శాఖ నోటిఫికేషన్‌

25 నుంచి దరఖాస్తులు.. ఫిబ్రవరి 8 వరకు స్వీకరణ

10, 11 తేదీల్లో లాటరీ, 17న కేటాయింపు

ఈసారి దరఖాస్తు ప్రక్రియను సులభం చేసిన ఎక్సైజ్‌ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కొత్త బార్లు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 72 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 159 బార్లకు ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 55, పట్టణ ప్రాంతాల్లో 104 బార్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సోమవారం నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అదేరోజు జిల్లా ఎక్సైజ్‌ అధికారులు ఈ నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులు వచ్చే నెల 8వ తేదీ వరకు తీసుకుంటారు.

లాటరీ పద్ధతి
ఫిబ్రవరి 10న ఆయా జిల్లాల కలెక్టర్లు లాటరీ పద్ధతిన బార్లు కేటాయిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్సైజ్‌ కమిషనర్‌ 11న డ్రా తీస్తారు. బార్లు పొందిన వారి జాబితాను అదే నెల 12న ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్లు.. ఎక్సైజ్‌ కమిషనర్‌కు పంపనుండగా, 13న జీహెచ్‌ఎంసీ జాబితాను పంపుతారు. అదే నెల 17న లాటరీ వచ్చిన వారికి జిల్లా అధికారులు బార్లు కేటాయించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనైతే కమిషనర్‌ కార్యాలయంతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి డీసీ కార్యాలయాల్లో, రాష్ట్రంలోని మిగిలిన పట్టణ ప్రాంతాల్లో మాత్రం జిల్లా ఎక్సైజ్‌ కార్యాలయంతో పాటు డిప్యూటీ కమిషనర్, కమిషనర్‌ కార్యాలయాల్లో కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు లభ్యమవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు కింద రూ.లక్ష వసూలు చేయనున్నారు. గతంలో ఉన్న 1,030 బార్లకు అదనంగా కొత్త మున్సిపాలిటీల్లో మరో 159 ఏర్పాటు కానున్నాయి. 

దరఖాస్తు సులభం
ఈసారి బార్ల కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని సులభం చేసింది. ఒక్క పేజీలోనే ఎక్సైజ్‌ శాఖ దరఖాస్తును తయారుచేసింది. మూడు కలర్‌ పాస్‌పోర్టు ఫొటోలు, స్వీయ ధ్రువీకరణతో కూడిన పాన్‌కార్డు లేదా ఆధార్‌కార్డు మాత్రమే దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. బార్ల లాటరీ పూర్తయ్యాక మాత్రం 90 రోజుల్లోగా ఎక్సైజ్‌ శాఖ నిర్దేశించిన అన్ని నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే మరో 60 రోజులు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. కానీ ఈ కాలానికి మొదటి వాయిదా లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు అన్నీ పూర్తి చేసిన తర్వాతే బార్‌ లైసెన్స్‌ ఇస్తామని ఎక్సైజ్‌ శాఖ స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు