Robbery in Kukatpally: వరుసబెట్టి దోచేశారు.. అర్ధరాత్రి 13 ఇళ్లలో దొంగతనాలు 

24 Jan, 2023 14:00 IST|Sakshi

సాక్షి, కూకట్‌పల్లి: తాళం వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహించిన దొంగలు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఏకంగా 13 ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం వెలుగులోకి వచి్చంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి ఓ దొంగల ముఠా విడిపోయి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దయార్‌గూడ, కేరళబస్తీ, దేవీనగర్‌ ప్రాంతాల్లో తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారు. ఇళ్లలోని వస్తువులను చిందరవందర చేసి అందినకాడికి దోచుకెళ్లారు.

ఓ ఇంట్లో  గల్లాపెట్టెలో ఉన్న రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లగా మరో ఇంటిలో వెండి పట్టా గొలుసులు, ఒక ఇంట్లో ల్యాప్‌టాప్‌ ఇలా దొరికిన వస్తువును ఎత్తుకెళ్లారు. చోరీలు జరిగిన ఇళ్ల యజమానులు అందుబాటులో లేకపోవటంతో ఎవరింట్లో ఎంత సొత్తు అపహరణకు గురైందో వివరాలు తెలియలేదు. యజమానులు ఊళ్ల నుంచి తిరిగి వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం 9 ఇళ్లల్లో తాళాలు పగలగొట్టినట్లు తమకు సమాచారం అందినట్లు తెలిపారు.  

పోలీసులు, క్లూస్‌ టీం సిబ్బంది దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. సీసీ పుటేజీల ఆధారంగా అర్ధరాత్రి 2 నుంచి 4 గంటల సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడిన ట్లు నిర్ధారణకు వచ్చారు. ముందుగానే రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

కార్పొరేటర్‌ పరిశీలన 
దయార్‌గూడ, కేరళబస్తీ, దేవీనగర్‌లలో దొంగతనా లు జరిగిన ఇళ్లను సోమవారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు కూకట్‌పల్లి కార్పొరేటర్‌ జూపల్లి సత్యనారాయణ పరిశీలించారు.  పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కూకట్‌పల్లి ఏసీపీ చంద్రశేఖర్, సీఐ నర్సింగ్‌రావు, నాయకులు బొట్టు విష్ణు, సంతోష్‌, రాము, వెంకటేష్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Hyderabad: బాలీవుడ్‌లో నటన.. కూతురికి మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తానంటూ.. 

మరిన్ని వార్తలు