165 ప్రైవేటు ఆస్పత్రులు సీజ్‌ 

12 Oct, 2022 01:24 IST|Sakshi

నిబంధనలు పాటించని ఆస్పత్రులపై వైద్యశాఖ ఉక్కుపాదం 

1,163 ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు జారీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు చేపట్టగా ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్దఎత్తున అవకతవకలు వెలుగుచూశాయి. అవకతవకలను అరికట్టేందుకు 3,810 ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌లు, క్లినిక్‌లను ఆయా జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని 1,163 ఆస్పత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 165 ఆస్పత్రులను సీజ్‌ చేయగా, మరో 106 ఆస్పత్రుల యాజమాన్యాలకు జరిమానాలు విధించి హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రజారోగ్య విభాగానికి నివేదిక సమర్పించగా, అధికారులు మంగళవారం గణాంకాలు విడుదల చేశారు.

వామ్మో నాగర్‌కర్నూల్‌... 
అధికారులు సీజ్‌ చేసిన 165 ఆస్పత్రుల్లో 41 ఆస్పత్రులు నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనివే కావడం గమనార్హం. ఈ జిల్లాలో మొత్తం 54 ఆస్పత్రులను తనిఖీ చేసిన అధికారులు అందులో 70 శాతం ఆస్పత్రులను సీజ్‌ చేయడాన్ని చూస్తే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అత్యధిక ఆస్పత్రులు సీజ్‌ చేసిన కేటగిరీలో నల్లగొండ–17, సంగారెడ్డి–16, భద్రాద్రి కొత్తగూడెం–15, హైదరాబాద్‌–10, రంగారెడ్డి–10 ఆస్పత్రులు ఉన్నాయి.

నోటీసులు జారీ చేసిన కేటగిరీలో హైదరాబాద్‌–274, కరీంనగర్‌–124, రంగారెడ్డి –107 ఆస్పత్రులున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నోటీసుల జారీ ప్రక్రియ సాగింది. ప్రస్తుతం నోటీసుల జారీ, సీజ్, పెనాల్టీలతో సరిపెట్టిన వైద్య, ఆరోగ్య శాఖ వాటికి సంబంధించి వచ్చిన వివరణలు, తదుపరి చర్యలకు త్వరలో మరో డ్రైవ్‌ చేపట్టనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు