కేజీబీవీలో నాసిరకం ఆహారం

26 Dec, 2022 03:11 IST|Sakshi
విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ జయశ్రీ

19 మంది విద్యార్థినులకు అస్వస్థత

ముగ్గురు రిమ్స్‌కు తరలింపు

భోజనంలో తరచూ రాళ్లు, వెంట్రుకలు

భవనం పైకెక్కి విద్యార్థినుల ఆందోళన

నేరడిగొండ ‘కస్తూర్బా’లో ఘటన

నేరడిగొండ: నాసిరకం భోజనం కారణంగా 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని కేజీబీవీలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు భవనం పైకెక్కి ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో 248 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఉదయం టిఫిన్‌ (చపాతి, పెసరపప్పు) చేసిన 11మంది విద్యార్థినులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే సిబ్బంది స్థానిక పీహెచ్‌సీకి తరలించారు.

ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. ఈ క్రమంలో మిగతా విద్యార్థులు కేజీబీవీ భవనం పైకెక్కి ఆందోళన చేపట్టారు. ఇటీవల భోజనంలో తరచూ రాళ్లు, వెంట్రుకలు వస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆదివారం సెలవుదినం కావడంలో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు కూడా సిబ్బందిని నిలదీశారు.

దీంతో ప్రిన్సిపాల్‌ జయశ్రీ అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. సెక్టోరల్‌ అధికారి ఉదయశ్రీకి పలువురు పిల్లల తల్లిదండ్రులు ఫోన్‌ చేయగా, సోమవారం వచ్చి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. కాగా, ప్రిన్సిపాల్‌ను ఈ విషయమై సంప్రదించగా.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. కాగా, లంబాడా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జాదవ్‌ మహేందర్, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు విద్యార్థినుల నిరసనకు మద్దతు తెలిపారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించారు. 

>
మరిన్ని వార్తలు