రాష్ట్రంలో కరోనా పడకలు 19,025

18 Sep, 2020 03:48 IST|Sakshi

ప్రైవేట్‌లో 11,340.. ప్రభుత్వంలో 7,685 బెడ్లు

ఆయా ఆసుపత్రుల్లో మొత్తం పడకల్లో 12,256 ఖాళీ

తాజాగా 2,159 కేసులు.. మరో 9 మంది మృతి

వెయ్యి దాటిన కోవిడ్‌ మరణాలు..  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అవసరమైన పడకల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం 225  ప్రైవేట్‌ ఆసుప త్రుల్లో 11,340, 41 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,685 పడకలున్నాయి. మొత్తం 19,025 పడకలున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు గురువారం కరోనా బులెటిన్‌లో పేర్కొన్నారు. ఈ స్థాయిలో కరోనా పడకల సంఖ్య పెరిగినా, కేసులు భారీగానే నమోదవుతున్నా ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య ఆ స్థాయిలో ఉండటం లేదు.

అయితే కరోనా వచ్చిన వారిలో 70 శాతం మందిలో లక్షణాలుండటం లేదు. లక్షణాలున్న వారు కూడా తక్షణమే వైద్యం తీసుకుంటుండటంతో ఆసుపత్రులకు రావాల్సిన అవసరం లేకుండా పోతుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 19,025 కరోనా పడకల్లో 12,256 ఖాళీగా ఉండటమే అందుకు నిదర్శనం. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 30,443 ఉండగా, అందులో 23,674 మంది ఇళ్లలో, వివిధ సంస్థల ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని అధికారులు విశ్లేషిస్తున్నారు.

మరణాల సంఖ్య 1,005
రాష్ట్రంలో బుధవారం నాటికి 23,29,316 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, 1,65,003 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో బుధవారం 53,094 మందికి పరీక్షలు నిర్వహించగా, 2,159 మందికి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా 2,108 మంది కోలుకోగా, ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,33,555కు చేరింది. అలాగే మరో 9 మంది మృతి చెందగా, ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 1,005కు చేరుకుందని శ్రీనివాసరావు తెలిపారు. 

మరిన్ని వార్తలు