కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేస్తే రూ. 1.72 లక్షలు మాయం

15 Dec, 2021 11:45 IST|Sakshi

హిమాయత్‌నగర్‌: ఫోన్‌పేలో డబ్బులు కట్‌ అయ్యాయని కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేయగా.. ఉన్న వాటిని లూటీ చేశారని నగరవాసి ఒకరు మంగళవారం సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల నగరవాసి ఫోన్‌పే నుంచి కొంత డబ్బులు కట్‌ అయ్యాయి. తాను ఎవరికీ పంపకుండా ఇలా కట్‌ అవ్వడంపై తెలుసుకునేందుకు గూగుల్లో కనిపించిన ఫోన్‌పే కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు కాల్‌ చేశాడు. వారు చెప్పిన విధంగా బ్యాంకు వివరాలు అన్నీ చెప్పడంతో అకౌంట్‌లో నుంచి రూ. 1.72 లక్షలు స్వాహా చేశారు. 

బజాజ్‌ ఫైనాన్స్‌ పేరుతో... 
బజాజ్‌ కార్డుపై లోను వచ్చిందని తనని ఓ వ్యక్తి మోసం చేశాడని నగర వాసి ఒకరు సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఓ వ్యక్తి తాను బజాజ్‌ ఫైనాన్స్‌ నుంచి మాట్లాడుతున్నానని కాల్‌ చేశాడు. మీ కార్డుపై రూ. 5 లక్షల రుణం మంజూరైందన్నాడు. అది మీ అకౌంట్‌కు రావాలంటే డాక్యుమెంట్స్‌కి కొంత ఖర్చు అవుతుందన్నాడు. దీనికి సరే అనడంతో పలు దఫాలుగా రూ. 2.70 లక్షలు చెల్లించాడు. ఆపై రుణం రాకపోగా మరిన్ని డబ్బులు డిమాండ్‌ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వినయ్‌ తెలిపారు.

(చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..)

మరిన్ని వార్తలు