రెండు పడక గదులు .. వంద సమస్యలు!

4 Oct, 2021 03:52 IST|Sakshi

దేశంలోనే అద్భుత పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన

రాష్ట్రవ్యాప్తంగా 2,91,057 ఇళ్ల మంజూరు

నాలుగేళ్లలో సిద్ధమైనవి 1,02,714 ఇళ్లే

అందులోనూ వేల ఇళ్లు ఖాళీగానే

పథకానికి శాపంగా మారిన అక్రమాలు, రాజకీయ జోక్యం 

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. యావత్తు దేశం దృష్టినీ ఆకర్షించి, అబ్బురపరిచిన రాష్ట్ర ప్రభుత్వ ఉదాత్త పథకం. లబ్ధిదారు జేబు నుంచి నయా పైసా ఖర్చు లేకుండా, ప్రభుత్వమే పూర్తి వ్యయాన్ని భరిస్తూ రెండు పడక గదులతో ఇంటిని నిర్మించి నిరుపేదలకు ఇవ్వటం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ పథకాన్ని చాలా రాష్ట్రాలు నిశితంగా గమనించి ఆశ్చర్యపోయాయి. ఇంతటి గొప్ప పథకానికి కూడా నిర్మాణ లోపాలు, లొసుగులు, అక్రమాలు, రాజకీయ జోక్యం, నాణ్యత లోపం శాపంగా మారాయి.

ప్రభుత్వ ఉదాత్త సంకల్పానికి తగ్గట్టుగా యంత్రాంగం, నేతలు వ్యవహరించి ఉంటే మంచి ఫలితం దక్కేది. కానీ ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి ఆశయానికి తూట్లు పొడిచేలా వ్యవహరించడంతో మొత్తం ఇళ్లల్లో మూడింట దాదాపుగా ఒకవంతు మాత్రమే సిద్ధం అయ్యాయి. కొన్ని పూర్తయినా తుదిమెరుగులు (ఫినిషింగ్‌) పూర్తికాలేదు. కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. మరికొన్నిటికే అనుమతులే రాలేదు. 

ఇరుకు గదుల్లో ఇబ్బందులు చూసి.. 
గతంలో ఇరుకు గదులతో నిర్మించిన ఇళ్లలో పేదలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2016–17లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా 2,91,057 ఇళ్లను, వాటి కోసం రూ.10,438.44 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.

పనులు మొదలై నాలుగేళ్లు గడుస్తున్నా గత సెప్టెంబర్‌ 15 నాటికి కేవలం 1,02,714 ఇళ్లను మాత్రమే పూర్తి (గృహ ప్రవేశాలకు సిద్ధం) చేయగలిగారు. మరో 70,602 ఇళ్లు తుది దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక 63,678 ఇళ్లకు సంబంధించి అసలు పనులే ప్రారంభం కాలేదు. దాదాపు 18 వేల ఇళ్లకు ఇంకా పరిపాలన అనుమతులు రాలేదు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. 

పూర్తయిన ఇళ్లలోనూ 40% ఖాళీ 
పూర్తయిన ఇళ్లలో 40 శాతం ఇళ్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. వాటి చుట్టూ చెట్లు, తుప్పలు పెరిగి పాడుబడ్డ ప్రాంతాలుగా కనిపిస్తున్నాయి. వాటి కిటికీలు, తలుపులు, ఇతర సామగ్రిని దొంగలు తస్కరిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో లోపాలు, రాజకీయ నేతల మధ్య ఆధిపత్యపోరు దీనికి ప్రధాన కారణమవుతోంది. దివిటిపల్లి విషయానికొస్తే పాతతోట, పాత పాలమూరు ప్రాంతాల వారందరికీ ఈ ఇళ్లు దక్కాల్సి ఉంది.

కానీ లబ్ధిదారుల జాబితాలో ఇతరుల (అనర్హులు కూడా ఉన్నారనే ఆరోపణలున్నాయి) పేర్లు కూడా చేర్చేశారు. దీనివెనుక రాజకీయ నేతల హస్తం ఉందని అర్హులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఇళ్ల కేటాయింపులో జాప్యం జరుగుతూ పూర్తయిన ఇళ్ళు కూడా నిరుపయోగంగా ఉంటూ చుట్టూ చెట్లు, తుప్పలతో నిండిపోతున్నాయి. మరోవైపు ఇక్కడ కొన్ని ఇళ్లు పూర్తయినా తుది మెరుగులు పూర్తికాలేదని చెబుతున్నారు.

నారాయణపేట జిల్లాకు 2,017 ఇళ్లు మంజూరైతే ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా çపూర్తి కాలేదు. కేవలం 44 ఇళ్ల పనులు తుదిదశకు చేరుకున్నాయి. 1,117 ఇళ్ల పనులు అసలు మొదలే కాలేదు. వికారాబాద్‌ జిల్లాకు 4,109 ఇళ్లను మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. అసలు 1,962 ఇళ్ల పనులు మొదలే కాలేదు. ∙నాగర్‌కర్నూలు జిల్లాకు 3,201 ఇళ్లను కేటాయిస్తే ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. 668 ఇళ్లు మాత్రం తుదిదశకు చేరుకున్నాయి. 2,034 ఇళ్ల పనులు ఇంకా మొదలే కాకపోవటం విశేషం. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,470 ఇళ్లు మంజూరు అయితే 1,865 ఇళ్ల పనులు అసలు మొదలే కాలేదు. వాటికి అసలు టెండర్లే పిలవకపోవటం విశేషం.  

సమన్వయ లోపంతో పనుల్లో జాప్యం
పనుల్లో జాప్యానికి సమన్వయలోపం ప్రధాన కార ణంగా నిలిచింది. ఇళ్ల నిర్మాణానికి ముందు ఓ స్థలం ఎంపిక చేసి, ఆ తర్వాత రాజకీయ, ఇతరత్రా కారణాలతో మరో చోటకు మార్చారు. 
కొన్ని కాలనీలకు ఎంపిక చేసిన ప్రాంతం తమకు ఏమాత్రం యోగ్యంగా లేదంటూ స్థానికులు గృహ ప్రవే శాలకు ససేమిరా అంటున్నవి కూడా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ వీరన్నపేట కాలనీ దీనికో ఉదాహరణ. ఇక్కడ 800 ఇళ్లు నిర్మించారు. కానీ ఈ ప్రాంతం సరిగా లే దని లబ్ధిదారులు వాటిల్లోకి వెళ్లేందుకు నిరాకరిస్తూ దివి టిపల్లిలో నిర్మించిన ఇళ్లు కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
కొంతకాలం గృహనిర్మాణ సంస్థ, ఆ తర్వాత కలెక్టర్ల పర్యవేక్షణ.. ఇలా మారుతుండటం, నిధులు సకాలంలో విడుదల కాకపోవటంతో పనుల్లో జాప్యం జరిగింది. 
ఇళ్లకు ఖరారు చేసిన యూనిట్‌ కాస్ట్‌ ఏమాత్రం సరిపోదని, దానిప్రకారం నిర్మిస్తే నష్టాలనే మూటగట్టు కోవాల్సి ఉంటుందని తొలినాళ్లలో కాంట్రాక్టర్లు మొహం చాటేయటంతో ప్రధానపనులు చాలాకాలంపాటు మొదలు కాలేదు. ఆ తర్వాత రాయితీలు ప్రకటించటంతో ముందుకొచ్చారు. 

మరిన్ని వార్తలు