సీ4సీ చాలెంజ్‌కు 2 నగరాలు ఎంపిక

19 Feb, 2021 02:59 IST|Sakshi

స్టేజీ–1 కింద హైదరాబాద్, వరంగల్‌ ఎంపిక 

సాక్షి, హైదరాబాద్‌: సైకిల్‌ ఫర్‌ ఛేంజ్‌(సీ4సీ) చాలెంజ్‌ కార్యక్రమం స్టేజీ–1 కింద హైదరాబాద్, వరంగల్‌ నగరాలు సహా దేశంలోని 25 నగరాలు, పట్టణాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. నగరాలు, పట్టణాల్లో సైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ సీ4సీ చాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. కోవిడ్‌–19 మహమ్మారి నేపథ్యంలో ప్రజారోగ్యానికి మేలు చేయడానికి సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని, దీని వల్ల నగరాల్లో కాలుష్యం సైతం తగ్గుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 107 నగరాలు ‘సీ4సీ’చాలెంజ్‌కు రిజిస్ట్రర్‌ కాగా, తొలి విడత కింద ఎంపిక చేసిన 25 నగరాల పేర్లను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.

రాష్ట్ర పురపాలక శాఖ ఈ చాలెంజ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేకంగా సైక్లింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయ డంతో హైదరాబాద్, వరంగల్‌ నగరాల ఎంపికకు దోహదపడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఈ కార్యక్ర మానికి హెచ్‌ఎండీఏ, హైదరాబాద్‌ యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (హుమ్టా)లు సాంకేతిక సహాయం అందిస్తున్నాయి. పోలీసు శాఖ సహకారంతో ఇప్పటికే కేబీఆర్‌పార్క్, నెక్లెస్‌ రోడ్డులో సైక్లింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ లేని విధులు, సైకిల్‌ అద్దె సదుపాయాలు, సైక్లింగ్‌ ట్రైనింగ్‌ వంటి కార్యక్రమాలను సీ4సీ కింద ఎంపికైన నగరాల్లో అమలు చేయనున్నారు. ఈ 25 నగరాల్లో ఏడు నగరాలను స్టేజీ–2 కింద ఎంపిక చేసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ త్వరలో ప్రకటించనుంది. స్టేజీ–2 కింద ఎంపికైన ఏడు నగరాల్లో సైక్లింగ్‌ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.కోటి చొప్పున మంజూరు చేయనుంది. 

నర్చరింగ్‌ నెబర్‌హుడ్‌ చాలెంజ్‌కు హైదరాబాద్, వరంగల్‌ ఎంపిక పట్టణ ప్రాంతంలో 0–5 ఏళ్ల బాలబాలికలకు సురక్షితమైన, మెరుగైన సదుపాయాలు కలిగిన పరిసరాలను అందించడమే లక్ష్యంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ‘నర్చరింగ్‌ నెబర్‌ హుడ్‌’ చాలెంజ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని కింద హైదరాబాద్, వరంగల్‌ నగరాలుసహా దేశంలోని మొత్తం 25 నగరాలు, పట్టణాలు ఎంపికయ్యాయి. 63 నగరాలు ఈ చాలెంజ్‌లో పోటీపడ్డాయి. తొలి విడత కింద ఎంపికైన 25 నగరాలకు 6 నెలలపాటు చాలెంజ్‌ అమలుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించనున్నారు. ఈ నగరాల్లోని టాప్‌ 10 నగరాలకు 2 ఏళ్లపాటు సాంకేతిక సహకారాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అందించనుంది.  

మరిన్ని వార్తలు