అధినేత ‘మూడు’ ఎలాగుందో? 

4 May, 2022 00:24 IST|Sakshi

తెలంగాణ కోటాలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ 

ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న ఎమ్మెల్సీ బండా 

అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలంతో ఈ మూడు సీట్లూ టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే.. 

కేసీఆర్‌ దృష్టిలో పడేందుకు ఆశావహుల ప్రయత్నాలు 

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి పరిశీలనలో ప్రకాశ్‌రాజ్‌ సహా పలువురి పేర్లు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కోటాలో ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేందుకు ఈ నెల మూడో వారంలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముందని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు దృష్టిలో పడేందుకు ఆశావహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

అయితే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళల కోటాతో పాటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారి పేర్లను వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న కేసీఆర్‌.. మూడు సీట్లలో ఒకదానిని తెలంగాణేతరులకు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 

బోలెడు మంది ఆశావహులు  
పార్టీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు కూడా టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కెప్టె న్‌ లక్ష్మీకాంతరావును వరుసగా మూడో పర్యాయం కూడా రాజ్యసభకు పంపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులుతో పాటు సిట్టింగ్‌ ఎంపీలుగా ఉంటూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌ దక్కని మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మందా జగన్నాథం, ప్రొఫెసర్‌ సీతారామ్‌ నాయక్‌ కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు.

మైహోమ్‌ సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావును టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు నామినేట్‌ చేస్తారనే ప్రచారం జరిగినా సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇద్దరి నడుమ దూరం పెంచినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అధికార పార్టీకి చెందిన దినపత్రిక అధినేత దామోదర్‌రావు, గతంలో ఇదే పత్రిక వ్యవస్థాపకుౖడైన సీఎల్‌ రాజం పేర్లు కూడా పరిశీలించే అవకాశం ఉందని సమాచారం.

అలాగే మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన పీఎల్‌ శ్రీనివాస్, ఆకుల లలిత పేర్లు కూడా పార్టీ అధినేత కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. మరోవైపు తన వెంట మహారాష్ట్ర పర్యటనకు వచ్చిన నటుడు ప్రకాశ్‌రాజ్‌ను రాజ్యసభకు పంపేందుకు కూడా కేసీఆర్‌ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని ప్రకాశ్‌రాజ్‌ సేవలు జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు తోడుగా నిలుస్తాయనే భావన టీఆర్‌ఎస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. 

మూడూ ఏకగ్రీవమే.. 
రాజ్యసభ ఎన్నికల్లో శాసనసభ్యులు కీలకం కాగా రాష్ట్ర శాసనసభలో 119 మంది సభ్యులకు గాను టీఆర్‌ఎస్‌ సంఖ్యాపరంగా 103 మంది ఎమ్మెల్యేల బలాన్ని కలిగి ఉంది. దీంతో త్వరలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించిన మూడు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ ప్రతిపాదించిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.  

ఇద్దరి పదవీ కాలం పూర్తి.. ఒకరి రాజీనామా 
రాజ్యసభలో తెలంగాణ నుంచి ఏడుగురు సభ్యులకు ప్రాతినిధ్యం ఉండగా, టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు.. కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ వచ్చే నెల 22న ఆరేళ్ల పదవీ కాల పరిమితి పూర్తి చేసుకుంటున్నారు. 2018లో టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు ఎన్నికైన బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ గత ఏడాది నవంబర్‌లో శాసన మండలి సభ్యుడిగా ఎన్నిక కావడంతో గత ఏడాది డిసెంబర్‌ 4న రాజ్యసభకు రాజీనామా చేశారు. ఈ విధంగా తెలంగాణకు సంబంధించి మూడు సీట్లు ఖాళీ అయ్యాయి.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకం 
ఈ ఏడాది జూలైలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఆగస్టులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాల పరిమితి కూడా ముగియనుంది. ఈ రెండు ఎన్నికల్లోనూ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఉభయ సభల ఎంపీలు ఓటు హక్కు కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో టీఆర్‌ఎస్‌కు ఉండే మొత్తం ఏడు ఓట్లు ఈ ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్నాయి.    

మరిన్ని వార్తలు