20మంది జెడ్పీ హైస్కూలు విద్యార్థులకు అస్వస్థత

15 Nov, 2022 03:29 IST|Sakshi
విద్యార్థినిని పరీక్షిస్తున్న డీఎంహెచ్‌ఓ 

మధ్యాహ్న భోజనం కలుషితమైనట్లు అనుమానాలు

చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం పోకలగూడెంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు 20 మంది సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతుండగా, మధ్యాహ్న భోజనం కలుషితమైనట్లు అనుమానిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 111 మంది విద్యార్థులు భోజనం చేయగా, సాయంత్రం 20 మందికి పైగా విద్యార్థులు దగ్గు, గొంతు మంటతో అస్వస్థతకు గురయ్యారు.

దీంతో హెచ్‌ఎం జుంకీలాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి వారిని చండ్రుగొండ పీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని చికిత్స అందిస్తున్న డాక్టర్‌ వెంకట్‌ ప్రకాష్‌ తెలిపారు. డీఎంహెచ్‌ఓ దయానందస్వామి వచ్చి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. 

మరిన్ని వార్తలు