2022 Roundup-Hyderabad: సంచలనాల సమాహారం!

26 Dec, 2022 11:51 IST|Sakshi

నగరంలో అనేక సంచలనాత్మక ఉదంతాలు 

సీరియల్‌ స్నాచింగ్స్‌తో మొదలైన ఈ నేరాలు 

‘ఫామ్‌హౌస్‌–ఈడీ’ కేసుల వరకు ఎన్నెన్నో... 

మహా నగరానికి సంబంధించి 2022 ఆద్యంతం సంచలనాత్మక ఉదంతాలు, ఘటనలు, నేరాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఈ ఏడాది జనవరి నెలలో గుజరాత్‌కు చెందిన సీరియల్‌ స్నాచర్‌ ఉమేష్‌ ఖతిక్‌ వరుస పెట్టి పంజా విసిరాడు. అక్టోబర్‌లో మొదలైన ‘ఫామ్‌హౌస్‌’ ఎపిసోడ్‌... ఈడీ కేసులు, నోటీసులతో డిసెంబర్‌ వరకు కొనసాగింది... కొనసాగుతోంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ కేంద్రంగా చోటు చేసుకున్న ‘అగ్నిపథ్‌’ అల్లర్లు, అమ్నేషియా–పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్స్‌ వ్యవహారాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. ఆయా ఉదంతాలను ఒక్కసారి పరిశీలిస్తే... 
– సాక్షి, సిటీబ్యూరో

రికార్డులకు ఎక్కిన తొలి డ్రగ్‌ మరణం
డ్రగ్‌ పెడ్లర్‌ ప్రేమ్‌ ఉపాధ్యాయ ఎల్‌ఎస్డీ బోల్ట్స, ఎక్స్‌టసీ పిల్స్‌ వంటి సింథటిక్‌ డ్రగ్స్‌ విక్రయిస్తున్నాడు. ఇతడి నుంచి నగరానికి చెందిన ఓ యువకుడు డ్రగ్స్‌ ఖరీదు చేశాడు. బీటెక్‌ పూర్తి చేసి, ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆ యువకుడు మాదకద్రవ్యాల ప్రభావంతో క్లరోసిస్‌ స్ట్రోక్‌తో బాధపడి చనిపోయాడు. గోవాలో జరిగిన పార్టీలో ఒకేసారి ఎల్‌ఎస్డీ, కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్‌టసీ పిల్స్‌తో పాటు హష్‌ ఆయిల్‌ తీసుకోవడంతో నగరానికి వచ్చాక ఇలా 
జరిగింది.  

మూడు కమిషనరేట్లలో పంజా
సీరియల్‌ స్నాచర్‌ జనవరిలో ఉమేష్‌ గులాబ్‌ భాయ్‌ ఖతిక్‌ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల అధికారులకు సవాల్‌ విసిరాడు. మెహదీపట్నంలో యాక్టివా వాహనం చోరీ చేశాడు. మరుసటి రోజు ఆ ల్వాల్‌ నుంచి మేడిపల్లి వరకు నేరాలు చేశాడు. వీటిలో స్నాచింగ్స్‌తో పాటు యత్నాలు ఉన్నాయి. గుజరాత్‌ పోలీసులకు పట్టుబడిన ఇతడిని సిటీకి తీసుకురావడం, రికవరీల్లోనూ అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. 

బ్యాంకు నుంచి రూ.కోట్లు కొట్టేసి.. 
ఆంధ్రప్రదేశ్‌ మహేష్‌ కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసి రూ.12.93 కోట్లు కొల్లగొట్టారు. ఈ వ్యవహారంలో నైజీరియన్లు కీలకంగా వ్యవహరించగా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చెన్నై వాసులు పాత్రధారులుగా ఉన్నాయి. ఈ కేసును కొన్ని రోజుల్లోనే ఛేదించిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు. అయితే ఇప్పటికీ సూత్రధారులు పరారీలోనే ఉన్నారు. 

జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని అమ్నేషియా పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. బాధితురాలిపై ఇన్నోవా కారులో అత్యాచారం జరగడానికి ముందు బెంజ్‌ కారులో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. నిందితులుగా ఉన్న వారిలో ఎమ్మెల్యే కుమారుడితో పాటు అనేక మంది ప్రముఖుల సంతానం ఉన్నారు. వీరిలో అత్యధికులు మైనర్లు కావడం గమనార్హం.  

ఫామ్‌హౌస్‌ టు ఈడీ 
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఖరీదు చేయడానికి ప్రయత్నించిన ఆరోపణలపై నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతి అరెస్టయ్యారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్‌ కీలక నేత బీఎల్‌  సంతోష్‌తో పాటు అనేకమంది ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు నందు భాగస్వామిగా ఉన్న అభిషేక్‌తో పాటు ఆ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి తదితరులను విచారిస్తున్నారు.     

ఫుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌.. 
బంజారాహిల్స్‌లోని రాడిస్సన్‌ బ్లూ ఆధీనంలోని ఫుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో జరిగిన డ్రగ్‌ పార్టీ గుట్టురట్టైంది. కొణిదెల నాగబాబు కుమార్తె నిహారికతో పాటు అనేక మంది ప్రముఖుల వారసులు దీనికి హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తు ఇటీవలే పూర్తి చేసిన పోలీసులు, ఆరుగురిని నిందితులుగా ఖరారు చేస్తూ అభియోగపత్రాలు దాఖలు చేశారు.  

ఉగ్రవాదికి 16 ఏళ్ల జైలు 
పాక్‌ నిఘా సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో భారీ విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్‌ అజీజ్‌ అలియాస్‌ గిడ్డా అజీజ్‌ దోషిగా తేలాడు. ఇతడికి 16 ఏళ్ల జైలు శిక్ష, రూ.26 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న మహ్మద్‌ నిస్సార్‌కు న్యాయస్థానం 2011లోనే 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది.  

బోరుమన్న బోయగూడ 
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో ఉన్న న్యూ బోయగూడ ప్రాంతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం బీహార్‌ నుంచి వలసవచ్చిన 11 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంది. సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్డు గోదాములో మొత్తం నలుగురు వ్యాపారాలు చేస్తున్నారు. దీని మధ్య భాగంలో దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సంపత్‌ అనే వ్యాపారి శ్రావణ్‌ ట్రేడర్స్‌ పేరుతో స్క్రాప్‌ గోదాం నిర్వహిస్తున్నారు. ఇందులోనే అగ్నిప్రమాదం జరిగింది. 

అగ్నిపథ్‌తో అట్టుడికింది 
కేంద్ర ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకానికి సంబంధించిన సెగ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు తాకింది. నిరుద్యోగులు ఒక్కసారిగా ఈ స్టేషన్‌ను ముట్టడించారు. రైలు పట్టాలపై ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) లాఠీచార్జ్‌ చేసింది. దీంతో ఆందోళన ఉధృతం చేసిన నిరుద్యోగులు విధ్వంసానికి దిగారు. ఆరు ప్లాట్‌ఫామ్స్‌లోని దుకాణాలతో సహా ప్రతీది ధ్వంసం చేయడంతో పాటు రైళ్ల పైనా రాళ్లు రువ్వారు. కొన్ని బోగీలకు నిప్పుపెట్టారు. ఆర్పీఎఫ్‌ అధికారులు కాల్పుల్లో ఓ యువకుడు చనిపోగా... 12 మందికి గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు