2022 REWIND: ఉద్యోగాల జాతర.. ఆరోగ్యానికి ఆసరా.. 

30 Dec, 2022 01:17 IST|Sakshi

2022 ఏడాదిలో పలు రంగాల్లో కీలక పరిణామాలు 

పెద్ద సంఖ్యలో ప్రభుత్వ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ 

హరితహారంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటి రికార్డు 

ఉద్రిక్తంగా మారిన ‘పోడు’సమస్య.. ఎఫ్‌ఆర్‌వో హత్య 

ఒకే ఏడాదిలో 8 కొత్త మెడికల్‌ కాలేజీలు..

గర్భిణుల కోసం న్యూట్రిషన్‌ కిట్‌ పథకం 

డీజిల్‌ సెస్‌ రూట్లో గాడినపడ్డ ఆర్టీసీ 

ఉపాధి హామీ పథకంపై కేంద్రంతో జగడం 

రాష్ట్రంలో 2022 ఏడాది ఎన్నో కీలక పరిణామాలకు సాక్షిగా నిలిచింది. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ, వైద్యారోగ్య రంగంలో కీలక పథకాలు, మార్పులతో సానుకూలతలు కనిపించగా.. పోడు భూముల వివాదం, ఉపాధ్యాయుల సమస్యలు వంటివి నిరసనలు, ఆందోళనలకు తెరలేపాయి. ఒక్క ఏడాదిలోనే ఎనిమిది కొత్త మెడికల్‌ కాలేజీలు రావడం రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనకరంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలను ఏర్పాటు చేసే అంశంలో ఈ ఏడాది ముందడుగు పడింది. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో పలు రంగాల్లో 2022 తెచ్చిన ప్రత్యేకతలేమిటో చూద్దాం.. 
– సాక్షి, హైదరాబాద్‌ 

అడవి పెరిగింది.. ‘పోడు’గొడవ పెరిగింది! 
రాష్ట్రంలో పోడు భూముల సమస్య మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సమస్యపై ప్రభుత్వపరంగా పరిశీలన జరుగుతున్నపుడే గొత్తికోయల చేతుల్లో ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు హత్యకు గురికావడం కలకలం రేపింది. అటవీశాఖ అధికారులు, సిబ్బందిలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పోడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కచ్చితమైన విధానాన్ని రూపొందించాలనే డిమాండ్లు వచ్చాయి.

మరోవైపు తెలంగాణకు హరితహారం ఎనిమిదో ఏడాదిలోకి అడుగిడింది. ఈ ఏడాది హరితహారం లక్ష్యం 19.54 కోట్ల మొక్కలుకాగా 20.25 కోట్ల మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల రహదారుల వెంట సుమారు లక్ష కిలోమీటర్ల మేర రహదారి వనాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ట్రీ సిటీ ఆఫ్‌ వరల్డ్‌గా హైదరాబాద్‌కు గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో పులుల సంచారం పెరిగింది. ఆసిఫాబాద్‌లో ఒకరు పులి దాడిలో మృతి చెందారు.  

వైద్య విద్యలో రికార్డు.. ఆరోగ్యానికి తోడ్పాటు 
రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం 2022లో కీలక ముందడుగు వేసింది. ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వ రంగంలో ఎనిమిది మెడికల్‌ కాలేజీలను స్థాపించడం, తద్వారా రాష్ట్రంలో 1,150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రావడం, తొమ్మిది జిల్లాల్లో గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్లు అందించే పథకాన్ని ప్రారంభించడం ప్రశంసలు పొందాయి.

మిగతా జిల్లాల్లోనూ మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తామని, సమాంతరంగా నర్సింగ్, పారామెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక వైద్యారోగ్య మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచింది. ఆయన ఆధ్వర్యంలో అన్ని విభాగాలపై నెలవారీ సమీక్షలు జరుగుతున్నాయి. సంస్కరణలకూ తెరలేచింది. 

దారిన పడిన ఆర్టీసీ 
దివాలా అంచుకు చేరిన ఆర్టీసీని ఈ ఏడాది చిన్న ఆలోచన మళ్లీ నిలిపింది. డీజిల్‌ సెస్‌ పేరుతో చార్జీల సవరణ చేపట్టి ఆదాయాన్ని పెంచుకుని.. నష్టాల ఊబి నుంచి కొంతమేర బయటపడింది. సెస్‌ల రూపంలో టికెట్‌ చార్జీలను పెంచి ధైర్యం చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రాకుండా పలు చర్యలు చేపట్టడం కలసివచ్చింది.

ఇదే సమయంలో డిపో స్థాయి నుంచి ప్రధాన కార్యాలయం దాకా సిబ్బంది పనితీరును సమీక్షించి మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఓరియంటేషన్లు, ప్రత్యేక శిక్షణలు, స్టడీ టూర్లు, వ్యక్తిగత పనితీరు మెరుగుపడటం, 100 డేస్‌ చాలెంజ్, శ్రావణమాసం చాలెంజ్, దసరా పండుగ చాలెంజ్, హెల్త్‌ చాలెంజ్, ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ వంటి కార్యక్రమాలతో సిబ్బంది పనితీరు సమూలంగా మారింది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనట్టుగా 45 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. 

కొత్త కొలువుల జాతర.. 
రాష్ట్రంలో 2022 ఏడాది కొలువుల జాతరను తీసుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనంతస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80వేల మేర ఉద్యోగాలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో భర్తీ చేస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) 503 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది.

గ్రూప్‌–4 కేటగిరీలో 9 వేల కొలువులు, ఇంజనీరింగ్‌ విభాగాలు, ఇతర శాఖల పరిధిలో మరో 5వేల కొలువులకు ప్రకటనలు విడుదలయ్యాయి. రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామకాల బోర్డు ద్వారా దాదాపు 17 వేల ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడ్డాయి. వైద్య విభాగాల్లోనూ ఖాళీల భర్తీ చేపట్టారు. గురుకుల విద్యా సంస్థల్లోనూ 12 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. 

‘రోడ్ల’కు మంచి రోజులు 
తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర రహదారులకు పూర్తిస్థాయి నిర్వహణ పనులకు ఈ ఏడాదే గ్రీన్‌సిగ్నల్‌ పడింది. ఈ మేరకు ప్రభుత్వం రూ.2,500 కోట్లు మంజూరు చేసింది. కనీసం నాలుగు వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రోడ్లు భవనాల శాఖలో ఈ ఏడాది భారీ మార్పులు జరిగాయి. కొత్తగా 472 అదనపు పోస్టులు మంజూరు చేయడంతోపాటు 3 సీఈ, 10 సర్కిల్, 13 డివిజన్, 79 సబ్‌డివిజన్‌ కార్యాలయాలను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

తొలగిన సవాళ్లు.. 
కోవిడ్‌ మహమ్మారి ప్రభావం తగ్గడంతో 2022లో విద్యా సంస్థల్లో పునరుత్తేజం కనిపించింది. అదే సమయంలో ఎన్నో సవాళ్లూ ఎదురయ్యాయి. కార్పొరేట్‌కు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దుతామంటూ ‘మన ఊరు–మనబడి’పథకాన్ని ప్రారంభించినా ఆచరణలో నిరాశే ఎదురైంది. తొలి విడతగా 9 వేలకుపైగా బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పెట్టుకోగా 1,200 స్కూళ్లలోనే పూర్తయ్యాయి.

ప్రభుత్వ స్కూళ్లలో బదిలీలు, ప్రమోషన్లు, 317 జీవో వల్ల ఏర్పడ్డ సమస్యలపై ఉపాధ్యాయులు ఆందోళనలు చేశారు. టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అడుగు ముందుకు పడలేదు. మరోవైపు ఇంజనీరింగ్, ఇతర కోర్సుల ఫీజుల పెంపు వంటివి విద్యార్థులపై భారం వేశాయి. ఇక ఈ ఏడాది కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడం, పలు మైనారిటీ గురుకులాలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయడం పెద్ద సంఖ్యలో విద్యార్థులకు లబ్ధి చేకూర్చింది. 

కేంద్రంతో తప్పని ‘పంచాయితీ’! 
2022 ఏడాది మొదట్లోనే కేంద్ర, రాష్ట్రాల మధ్య వివిధ అంశాలపై మొదలైన ‘పంచాయితీ’చివరికి మరింత ముదిరింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు తగ్గాయని, శాఖల వారీగా వచ్చే నిధుల జాడేలేకుండా పోయిందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. తెలంగాణ చేపట్టిన పలు పథకాలకు నిధులివ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా కేంద్రం మొండిచేయి చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ఆరోపించారు.

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద నిబంధనలకు విరుద్ధంగా రైతు కల్లాలు నిర్మించారంటూ కేంద్రం పేర్కొనడం, అందుకు సంబంధించిన రూ.150 కోట్లను తిరిగివ్వాలని పట్టుపట్టడం అగ్నికి ఆజ్యం పోసింది. కేంద్రం తీరు సరిగా లేదని, రాష్ట్రానికి రావాల్సిన రూ.1,100 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ధర్నాలు, నిరసనలు నిర్వహించింది. ఇక వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గింపు ఈ ఏడాదే అమల్లోకి వచ్చింది. డయాలసిస్‌ బాధితులకు పింఛన్ల మంజూరు కూడా మొదలైంది. ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో రాష్ట్రం సత్తా చాటింది.  

మరిన్ని వార్తలు