వెంటిలేటర్‌ ఉన్న ఐసీయూ పడకలు 1,841

25 Sep, 2020 03:18 IST|Sakshi

ప్రభుత్వంలో 798, ప్రైవేట్‌లో 1043

వెంటిలేటర్లు లేని ఐసీయూ పడకలు మొత్తం 2,423

వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో ప్రత్యేకంగా వెల్లడి

రాష్ట్రంలో మొత్తం 26.84 లక్షల టెస్టులు.. 1.79 లక్షల కేసులు

ఒక్కరోజులో 55,318 కరోనా పరీక్షలు.. 2,176 కేసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా బాధితుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కలిపి 1,841 వెంటిలేటర్‌ సదుపాయం కలిగిన ఐసీయూ పడకలు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 798 ఉండగా, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 1,043 ఐసీయూ వెంటిలేటర్‌ పడకలను కరోనా కోసం కేటాయించారు. ఇక వెంటిలేటర్‌ లేని ఐసీయూ పడకలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కలిపి 2,423 ఉన్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 441, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 1,982 పడకలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు గురువారం ఉదయం విడుదల చేసిన కరోనా బులెటిన్‌లో ఆయన ఐసీయూ పడకలను ప్రత్యేకంగా వర్గీకరించారు. ఇప్పటివరకు కేవలం ఐసీయూ పడకలు ఎన్ని, వాటిల్లో ఎన్ని నిండుతున్నాయి... ఎన్ని ఖాళీగా ఉన్నాయన్న సమాచారాన్ని ఇవ్వగా, ఇప్పుడు దీన్ని ప్రత్యేకంగా వర్గీకరించి విడిగా వెల్లడించారు. దీంతో వెంటిలేటర్‌ సౌకర్యం ఉన్న పడకలు ఎన్నో తెలుసుకొని బాధితులు ఆయా ఆస్పత్రులకు వెళ్లడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. 

26.84 లక్షల టెస్టులు.. 1.79 లక్షల కేసులు
రాష్ట్రంలో బుధవారం నాటికి 26,84,215 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు 1,79,246 మందికి వైరస్‌ సోకినట్లు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఇక బుధవారం ఒక్కరోజే 55,318 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 2,176 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,070కి చేరింది. కరోనా బారి నుంచి ఒక్క రోజే 2,004 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,48,139కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,037 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,929 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ప్రతీ పది లక్షల జనాభాలో 72,299 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇదిలా ఉండగా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 308, రంగారెడ్డి జిల్లాలో 168, మేడ్చల్‌లో 151, నల్లగొండ 136, కరీంనగర్‌లో 120 ఉన్నాయి. 

మరిన్ని వార్తలు