22 రెగ్యులర్‌ రైళ్లకు పచ్చజెండా

25 Feb, 2021 02:55 IST|Sakshi

ఏప్రిల్‌ మొదటి వారంలో‌ రైళ్ల ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు పాత రైళ్ల పునరుద్ధరణకు రైల్వే చర్యలు ప్రారంభించింది. గతంలో రెగ్యులర్‌ రైళ్లుగా నడిచి లాక్‌డౌన్‌ సమయంలో నిలిచిపోయిన వాటిల్లో నుంచి ఏప్రిల్‌ మొదటి వారంలో 22 రైళ్లను తిరిగి ప్రారంభించనున్నట్టు రైల్వే ప్రకటించింది. లాక్‌డౌన్‌ సమయంలో నిలిచిపోయినవాటిల్లోంచి కొన్నింటిని ప్రత్యేక కోవిడ్‌ రైళ్లుగా, పండుగ ప్రత్యేక రైళ్లుగా నడుపు తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తొలిసారి ప్రత్యేక రైళ్లుగా కాకుండా వాటి పాత నంబర్లతోనే 22 రైళ్లను ప్రారంభించనున్నారు.

రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటం, రైళ్లు చాలినన్ని లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇక రైళ్ల పునరుద్ధరణే ఉత్తమమని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రమంగా కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నందున, మార్చి నెల వేచి చూసి ఏప్రిల్‌లో వీటిని ప్రారంభించాలని నిర్ణయించటం విశేషం. ఇప్పుడు ప్రారంభమయ్యే రైళ్లు ఏప్రిల్‌ 1–7 వరకు కొన్నికొన్ని చొప్పున ప్రారంభమవుతున్నాయి. రిజర్వేషన్‌ పద్ధతిలోనే వీటిల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి.

చదవండి:  (రైళ్లలో రద్దీ నివారణకే చార్జీల పెంపు)

>
మరిన్ని వార్తలు