ఒక్కటికానున్న 220 జంటలు 

11 Feb, 2023 03:12 IST|Sakshi
మెహందీ కార్యక్రమంలో నూతన వధువులు 

నాగర్‌కర్నూల్‌లో సామూహిక వివాహాలు 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఒకేసారి 220 జంటలు వివాహ వేడుకతో ఒక్కటయ్యే దృశ్యం నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలో ఆదివారం ఆవిష్కృతం కానుంది. ఎంజేఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి జమున ఆధ్వర్యంలో ఐదోసారి సామూహిక వివాహ మహోత్సవాన్ని ఆదివారం ఉదయం 10.05 గంటలకు నిర్వహించనున్నారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తికాగా, శుక్రవారం కాబోయే జంటలకు మెహందీ, హల్దీ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించి కాబోయే వధువరులు మురిసిపోయారు. సామూహిక వివాహ వేడుకల్లో మొత్తం 220 జంటలకు ఏకకాలంలో వివాహం నిర్వహించనున్నారు.

ప్రధాన వేదికపై యాదాద్రి లక్షీనరసింహస్వామి ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి వారికి కల్యాణం నిర్వహించనుండగా, ప్రతి జంటకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముత్యాల పందిరిలో వివాహాలు జరిపించనున్నారు. పెళ్లయ్యే జంటల తరపున బంధువులందరికీ విందు భోజనాలు కూడా పెడుతున్నారు. కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.  

కార్యకర్తల బలంతోనే..: జనార్దన్‌రెడ్డి 
కార్యకర్తలు, ప్రజల తోడ్పాటుతోనే ఐదోసారి సామూహిక వివాహాలు చేయగలుగుతున్నాం. ఎంతోమంది నిరుపేదలకు వారి పిల్లల పెళ్లిళ్లు చేయడమనేది కలగానే ఉంటుంది. పెద్దసంఖ్యలో జంటలకు వివాహం జరిపించడం అదృష్టంగా భావిస్తున్నా.  

మరిన్ని వార్తలు